వైభవ్ సూర్యవంశీ తదుపరి మ్యాచ్ ఎప్పుడంటే? పూర్తి వివరాలు ఇవే..
ABN , Publish Date - May 30 , 2026 | 03:41 PM
ఐపీఎల్ వేదికగా కొద్ది రోజుల పాటు సాగిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవ్వడంతో ఫైనల్ చేరాలనే అతని కల చెదిరింది.
స్పోర్ట్స్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026లో ఎక్కువగా వినిపించిన పేరు ఇదే. క్రికెట్ దిగ్గజాలు కోహ్లీ, ధోనీల పేర్లను సైతం మర్చిపోయేలా తన ఆటతో ఈ చిచ్చర పిడుగు ప్రేక్షకులను కట్టి పడేశాడు. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ15 ఏళ్ల యువ సంచలనం అనేక రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. క్వాలిఫైయర్-2లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం పాలవ్వడంతో ఫైనల్ చేరాలనే అతని కల చెదిరింది. అయితే ఈ సీజన్ మొత్తంలో తన అద్భుతమైన ఆటతీరుతో కోట్ల మంది క్రికెట్ అభిమానులను సంపాదించుకున్న వైభవ్... తదుపరి మ్యాచ్ ఎప్పుడు ఆడుతాడనే ఆసక్తి అందరిలో నెలకొంది.
వైభవ్ సూర్యవంశీ తన తదుపరి మ్యాచుల ప్రయాణాన్ని జూన్ నుంచే ప్రారంభించబోతున్నాడు. శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో వైభవ్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. వన్డే ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో ఇండియా-ఎ జట్టుతో పాటు శ్రీలంక-ఎ, ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్‌కు యుంగ్ ప్లేయర్ తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు.
ఈ సిరీస్ షెడ్యూల్ ప్రకారం జూన్ 9న శ్రీలంక-ఎ జట్టుతో ఇండియా-ఎ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో వైభవ్ ఆటను క్రికెట్ ప్రియులు మరోసారి చూడొచ్చు. ఆ తర్వాత జూన్ 11న ఆఫ్ఘనిస్తాన్-ఎ, జూన్ 15న మళ్లీ శ్రీలంక-ఎ, జూన్ 17న మరోసారి ఆఫ్ఘనిస్తాన్-ఎ జట్లతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. జూన్ 21న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తంగా ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున చెలరేగినా ఈ 'బేబీ బాస్' త్వరలోనే ఇండియా-ఎ జెర్సీలో మరోసారి అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇండియా-ఎ జట్టు:
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిషాంత్ సింధు, సూర్యాంశ్ షెడ్గే, ప్రభుసిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్ర, విప్రజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్‌వీర్ సింగ్, అర్షద్ ఖాన్, అన్షుల్ కాంబోజ్, అనుకుల్ రాయ్
ఇవీ చదవండి:
వైభవ్ అతి త్వరలో జాతీయ జట్టుకు ఎంపికవుతాడు: సంగక్కర
రెండోసారి హిట్ వికెట్.. సాయి సుదర్శన్ స్పందనిదే..