విశాఖకు రూ.1500 కోట్ల ప్రాజెక్టులు: ఎంపీ శ్రీభరత్
ABN , Publish Date - May 30 , 2026 | 03:19 PM
విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలకంగా మారుతున్నాయని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. దిశ సమావేశంలో 33 విభాగాల అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించేందుకు దిశ సమావేశం ఒక మంచి వేదికగా నిలుస్తోందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. దిశ సమావేశంలో 33 విభాగాలకు చెందిన అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విశాఖపట్నాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద విశాఖకు రూ.1,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరైనట్లు వెల్లడించారు. మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, నగర నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి కీలక ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై దిశ సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో అభివృద్ధి పనులు మందగించాయని, అనేక కీలక ప్రాజెక్టులు పక్కనపెట్టబడటంతో వాటి వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిందని శ్రీభరత్ విమర్శించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఇప్పుడు కొత్త పథకాల ద్వారా తిరిగి ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు. విశాఖ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం మరోసారి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని చెప్పారు. అలాగే విశాఖ బీచ్‌లలో లభించే ఖనిజ సంపదను త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని, విశాఖ అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశాలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని గణబాబు తెలిపారు.
ఇవి కూడా చదవండి
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..