వైఎస్ వివేకా కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 30 , 2026 | 01:15 PM
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు.
అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు వివేకా కుమార్తె సునీతకు ఉందన్నారు. ఆమె పోరాటం కారణంగానే ఇప్పటికీ వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు. సునీత పోరాటంలో న్యాయం, ధర్మం ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌చాట్ నిర్వహించి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ చరిత్ర, హత్యా రాజకీయాల గురించి ప్రస్తుత తరానికి తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వైఎస్ కుటుంబం అరాచకాల గురించి తనకు కూడా కొన్ని విషయాలు తెలియవని.. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల క్రితం వచ్చిన 'కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం' పుస్తకాన్ని ఇప్పుడు అందరూ చదువుతున్నారని తెలిపారు. సైకో కంటే 'గొడ్డలి పార్టీ' అనే పేరును ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. గొడ్డలి పార్టీ అనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లే కొద్దీ జగన్‌లో అసహనం పెరుగుతోందని ఎద్దేవా చేశారు.
హత్యా రాజకీయాలు చేసిన వారు రాష్ట్రాన్ని పరిపాలించవచ్చు కానీ, బాధితులు మాత్రం జిల్లా రాజకీయాలు చేయకూడదా? అంటూ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నక్సలైట్లు తుపాకులతో రాజ్యాధికారాన్ని సాధించలేకపోయారని.. అలాగే గొడ్డలి పార్టీతో వీళ్లు రాజకీయాలు ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు ప్రజాస్వామ్యానికి వీళ్లు ఎలా సరిపోతారంటూ వైసీపీ, జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
బ్రో... జాగ్రత్త..! సోషల్ మీడియాలో రెచ్చగొడితే జైలుకే