Share News

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా

ABN , Publish Date - May 30 , 2026 | 02:02 PM

తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సును స్వామివారికి కానుకగా సమర్పించారు. దీంతోపాటు, రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ ట్యాబ్‌లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

శ్రీవారికి భారీ విరాళం.. ఎలక్ట్రిక్ బస్సు, యాపిల్ ట్యాబ్‌లు అందజేసిన నీరా రాడియా
Neera Radia Donates Rs.1.13 Crore Electric Bus and Apple iPads to TTD

తిరుమల, మే 30: కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రానికి ఇవాళ ప్రముఖ వ్యాపారవేత్త నీరా రాడియా తిరుమల తిరుపతి దేవస్థానానికి (TTD) భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు ఊతమిచ్చేలా దాదాపు రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎలక్ట్రిక్ (విద్యుత్) బస్సును ఆమె స్వామివారికి కానుకగా సమర్పించారు. దీనితో పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ నిర్వహణ కోసం సుమారు రూ.20 లక్షల విలువైన 15 యాపిల్ (Apple) ట్యాబ్‌లను కూడా ఆమె టీటీడీకి విరాళంగా ఇచ్చారు.

ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సుకు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దాత నీరా రాడియా ఈ బస్సు తాళాలను, యాపిల్ ట్యాబ్‌లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఇతర అధికారులు దాతలతో కలిసి కొత్త బస్సులో ప్రయాణించి బస్సు సామర్థ్యాన్ని, సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. తిరుమలలో భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి ఇలాంటి విరాళాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం టీటీడీ 'ధర్మరథం' సేవలో ఉన్న మొత్తం 20 బస్సుల్లో 14 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయని, ఇవి 21 బస్ స్టాప్‌ల మీదుగా రోజుకు 380 ట్రిప్పులు తిరుగుతూ భక్తులను ఉచితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో మిగిలిన డీజిల్ బస్సుల స్థానంలో కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ బస్సులనే ప్రవేశపెడతామని ఛైర్మన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దాత నీరా రాడియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


రేపే (ఆదివారం) మాస పౌర్ణమి గరుడ సేవ

తిరుమలలో ఆదివారం నాడు మాస పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీవారికి 'గరుడ సేవ' నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య శ్రీ మలయప్ప స్వామి వారు సర్వాలంకార భూషితుడై, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గరుడ వాహనంపై తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.


ఇవి కూడా చదవండి

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Updated Date - May 30 , 2026 | 02:18 PM