Share News

పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పు అదే: రవిచంద్రన్‌ అశ్విన్‌

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:32 AM

టీ20 ప్రపంచకప్‌2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి15న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 61 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ ఘోర పరాజయంపై భారత మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన యూట్యూబ్‌ ఛానల్ లో మాట్లాడాడు.

పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పు అదే: రవిచంద్రన్‌ అశ్విన్‌
Ravichandran Ashwin

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌2026లో భాగంగా కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న భారత్ (Team India), పాకిస్థాన్‌ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్‌ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సూపర్-8కి చేరుకుంది. ఇక పాకిస్థాన్‌ ఘోర పరాజయంపై భారత మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా మాట్లాడాడు. పాక్ ఓటమికి ప్రధాన కారణాల గురించి అశ్విన్ ప్రస్తావించాడు.


అశ్విన్ మాట్లాడుతూ.. ‘ ప్రేమదాస స్టేడియంలోని పిచ్‌ మీద 175 రన్స్ కూడా 200 పరుగులతో సమానం. పాక్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతోనే మ్యాచ్ ఓడిపోయింది. అదే పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పిదం. ఎందుకంటే ఈ పిచ్‌పై గతంలో జింబాబ్వే, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరిగింది. 170 పరుగులను ఆసీస్‌ జట్టు ఛేదించ లేకపోయింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకోవడం ఉత్తమం. ఆస్ట్రేలియా మాదిరిగానే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ లక్ష్య ఛేదనలో ఇబ్బంది పడింది. తీవ్రమైన ఒత్తిడికి గురై.. కేవలం 114 పరుగులకే ఆలౌటైంది. ఒత్తిడి విషయంలో పాకిస్థాన్ తో పోలిస్తే భారత్‌ 100 రెట్లు ఉత్తమం’ అన్నాడు.


ఇక పాకిస్థాన్(Pakistan) బౌలింగ్ గురించి కూడా అశ్విన్ ప్రస్తావించాడు. 'తొలి ఓవర్‌ కెప్టెన్ సల్మాన్‌ అఘా వేసిన తర్వాత, వెంటనే షాహిన్‌ అఫ్రిదిని బౌలింగ్‌కు తీసుకువచ్చి వారు చాలా పెద్ద తప్పు చేశారు. మొదటి ఓవర్‌లో పాక్.. అభిషేక్‌ శర్మ వికెట్‌ తీసుకుంది. గత మ్యాచుల్లో ఇషాన్‌ కిషన్‌..ఎడమ చేతివాటం బౌలర్లను ఉతికి ఆరేశాడు. అయినా పాకిస్థాన్‌ కెప్టెన్‌.. ఎడమ చేతివాటం బౌలరైన షాహిన్‌ అఫ్రిదికే బంతిని అందించాడు. అతడు వేసిన రెండు ఓవర్లలో ఏకంగా 31 పరుగులు వచ్చాయి. నా ఉద్దేశంలో రెండో ఓవర్‌ సైమ్‌ అయూబ్‌ వేసి ఉండాల్సింది’ అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.


ఇవీ కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు

ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్

Updated Date - Feb 18 , 2026 | 11:46 AM