చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Feb 18 , 2026 | 10:23 AM
కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్-2026లో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు.
స్పోర్ట్స్ డెస్క్: 'యువరాజ్' ఈ పేరు వినని క్రికెట్ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. కారణం.. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆయన తనదైన ఆటతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. యువరాజ్ సింగ్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికీ క్రికెట్ ప్రపంచంలో యువరాజ్ అనే పేరు ఎక్కడ వినిపించినా అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు.
తాజాగా టీ20 ప్రపంచ కప్-2026లో మరోసారి యువరాజ్ పేరు వినిపించింది. అయితే ఈ పేరు భారత స్టార్ యువరాజ్ సింగ్ కాదు.. కెనడా క్రికెటర్, భారత మూలాలు ఉన్న యువరాజ్ సమ్రా. ఇతడు తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సాధించాడు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా నిన్న(మంగళవారం) చెన్నై వేదికగా న్యూజిలాండ్, కెనడా (NZ vs CAN) జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో కెనడా ఓపెనర్ యువరాజ్ సమ్రా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 ఏళ్ల ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న యువరాజ్ సమ్రా 110 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. తద్వారా టీ20 ప్రపంచకప్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ బాదిన అతి పిన్న వయస్కుడిగా యువరాజ్ నిలిచాడు.
టీ20 డబ్ల్యూసీలో అతిపిన్న వయస్సులో సెంచరీ చేసిన ప్లేయర్లు వీరే..
యువరాజ్ సమ్రా (కెనడా) Vs న్యూజిలాండ్- 2026 (19 ఏళ్ల 141 రోజులు)
అహ్మద్ షెహజాద్ (పాకిస్థాన్) Vs బంగ్లాదేశ్- 2014 (22 ఏళ్ల 127 రోజులు)
సురేశ్ రైనా (భారత్) Vs సౌతాఫ్రికా- 2010 (23 ఏళ్ల 156 రోజులు)
అలెక్స్ హేల్స్ (ఇంగ్లండ్) Vs శ్రీలంక- 2014 (25 ఏళ్ల 83 రోజులు)
గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) Vs శ్రీలంక- 2022 ( 25 ఏళ్ల 327 రోజులు)
ఇవి కూడా చదవండి:
ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
నెదర్లాండ్స్‌తో ఆడే భారత తుది జట్టు ఇదే!