డబ్ల్యూసీ-2026: మేము కొలంబో వెళ్తాం: సూర్య కుమార్
ABN , Publish Date - Feb 05 , 2026 | 07:40 PM
భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామన్న పాకిస్థాన్ నిర్ణయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఐసీసీ షెడ్యూల్‌కు అనుగుణంగా తాము నడుచుకుంటామని స్పష్టం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ-20 ప్రపంచ కప్-2026 (T20 World Cup)లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సి ఉంది. పాక్ తీసుకున్న నిర్ణయంపై గురువారం మీడియా సమావేశంలో టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించాడు. తాము అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) షెడ్యూల్‌కు అనుగుణంగా నడుచుకుంటామని.. ఫిబ్రవరి 15న కొలంబోకు వెళ్తామని తేల్చి చెప్పాడు. ఈ విషయంలో తమకు పూర్తి స్పష్టత ఉందని సూర్య పేర్కొన్నాడు.
మీడియా సమావేశంలో సూర్య మాట్లాడుతూ.. 'మా మైండ్‌సెట్ క్లియర్‌గా ఉంది. మేమేమీ పాక్ తో మ్యాచ్ ఆడమని చెప్పలేదే!. వాళ్లే(పాకిస్థాన్) అలా చెప్పారు. ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. మా ప్రయాణానికి విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయి. కాబట్టి మేము కొలంబో వెళ్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో అక్కడే మాకూ తెలుస్తుంది’ అని సూర్య పేర్కొన్నాడు.
ఇక పాక్‌తో మ్యాచ్ రద్దు కావడం టోర్నీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీడియా ప్రశ్నించగా... 'వాళ్ల(పాక్) నిర్ణయం నా ఆధీనంలో ఉండదు కదా!. మా మేనేజ్‌మెంట్ ఫిబ్రవరి 15న మ్యాచ్ ఆడాలని మాకు చెప్పింది. ఇప్పటికే తటస్థ వేదిక మీద ఆసియా కప్ టోర్నీలో వాళ్లతో మూడు మ్యాచ్‌లు ఆడాము. కొలంబోలోనూ ఆడే ఛాన్స్ వస్తే ఆడతాం. ఇక ఆడటం.. ఆడకపోవడం నా నిర్ణయం కాదు. ఇదొక సంక్లిష్ట సమయం’ అని సూర్య వెల్లడించాడు. టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌తో తమ జట్టు మ్యాచ్ ఆడబోదని పాక్ ప్రధాని షెహబాజ్(Pakistan PM decision) వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇస్లామాబాద్‌లో మంత్రివర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా ఓపెనర్ ఎవరో తేల్చేసిన వార్మప్ మ్యాచ్
ఐసీసీ ఛైర్మన్ జైషాపై ఫిఫా అధ్యక్షుడు జియా ప్రశంసలు