Share News

మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు: మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ

ABN , Publish Date - Feb 05 , 2026 | 06:17 PM

మేడారం జాతరలో బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ స్పష్టం చేసింది. గురువారం మధ్యాహ్నం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ములుగుకు చేరుకుంది.

మేడారంలో గ్యాంగ్ రేప్ జరగలేదు: మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ

ములుగు, ఫిబ్రవరి 05: మేడారం జాతరలో బాలికపై సామూహిక అత్యాచారం జరగలేదని జాతీయ మహిళా కమిషన్ ఎంక్వయిరీ కమిటీ తేల్చి చెప్పింది. ఇవాళ(గురువారం) మధ్యాహ్నం జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ములుగుకు చేరుకుంది. అనంతరం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ దివాకరం, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌తో కమిటీ సమావేశమైంది. ఆ తర్వాత గ్యాంగ్ రేప్‌పై విచారణ చేపట్టింది.


అలాగే ఈ ఘటన జరిగిందంటూ ఆరోపిస్తున్న ప్రదేశాన్ని సైతం కమిటీ సభ్యులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని సదరు కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. దాంతో పోలీసుల నుంచి లిఖిత పూర్వక నివేదిక వచ్చాక.. జాతీయ మహిళా కమిషన్‌కు ఈ ఎంక్వయిరీ కమిటీ.. రిపోర్టును అందించనుంది.


మేడారంలో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. మామిడితోటలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు యువకులు వాష్ రూమ్‌కు వెళ్లిన బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ప్రచారం జరిగింది. అనంతరం ఈ ఘటనకు కారణమైన యువకులు జంపన్నవాగు సమీపంలోని ఒక షాపులో దాక్కున్నారని.. వారిని పోలీసులు తీసుకువెళ్లినట్లు ఆ వార్త కథనంలో పేర్కొన్నారు.


ఈ వార్తను ఇప్పటికే ములుగు ఎస్పీ రామ్‌నాథ్ సుధీర్ కేకర్ ఖండించారు. అలాంటి ఘటన ఏదీ చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. కమిషన్‌లోని సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. ములుగు వచ్చి వాస్తవ పరిస్థితులు పరిశీలించి.. కమిషన్‌కు నివేదిక అందజేయనుంది.


ఈ వార్త కూడా చదవండి:

తులం బంగారం వచ్చిన వారు కాంగ్రెస్‌కు ఓటెయ్యండి: కేటీఆర్

రాజకీయాల్లో డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలుస్తాం: సీఎం రేవంత్

Updated Date - Feb 05 , 2026 | 07:41 PM