Share News

రాజకీయాల్లో డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలుస్తాం: సీఎం రేవంత్

ABN , Publish Date - Feb 05 , 2026 | 05:01 PM

రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామని మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజలకు నమ్మకం కలిగించండి.. అదొక్కటే మిమ్మల్ని గెలిపిస్తుందని వారికి స్పష్టం చేశారు.

రాజకీయాల్లో డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలుస్తాం: సీఎం రేవంత్
CM Revanth Reddy

కరీంనగర్, ఫిబ్రవరి 05: రాజకీయాల్లో డబ్బులతో కాదు.. నమ్మకంతోనే గెలుస్తామని మున్సిపల్ ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. 'ప్రజలకు నమ్మకం కలిగించండి.. అదొక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది' అని వారికి స్పష్టం చేశారు. గురువారం నాడు కరీంనగర్‌ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ.. ఇవి కార్యకర్తల ఎన్నికలని తెలిపారు. కార్యకర్తలకు సముచిత స్థానం ఇచ్చినప్పుడే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని నేతలకు ఆయన సూచించారు.


అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లల్లో ఎన్నో సంక్షేమ పథకాలను అందించామని.. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందన్నారు రేవంత్ రెడ్డి. అయితే అధికార పార్టీలో టికెట్ ఆశించే వాళ్లు ఎక్కువగా ఉండటం సహజమని.. ఎంతో మంది పోటీ పడ్డా.. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ దక్కడం మీ అదృష్టమని అభ్యర్థులకు సోదాహరణగా వివరించారు. ఒక్క ఓటు.. గెలుపు ఓటములను నిర్ణయిస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.


టికెట్ రాని వారిని కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలంటూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి. పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోయినా మన ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించామని చెప్పుకొచ్చారు. పేదలకు సన్న బియ్యం.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని వివరించారు. మహిళా గ్రూపులకు సున్నా వడ్డీ రుణాలు అందించామని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని చెప్పారు.


పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలతోపాటు వాటి వల్ల చేకూరిన లబ్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని మున్సిపల్ అభ్యర్థులకు స్పష్టం చేశారు. మనం అబద్ధాలు చెప్పాల్సిన పనిలేదని.. ప్రభుత్వం చేసిందే ప్రజలకు చెప్పండంటూ వారికి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు

వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి

Updated Date - Feb 05 , 2026 | 05:50 PM