Share News

కొడుకు కల కోసం క్యాన్సర్‌ను దాచిన తండ్రి.. 11 ఏళ్ల నిరీక్షణకు ఫలితం!

ABN , Publish Date - Jul 28 , 2026 | 02:41 PM

దేశవాళీ క్రికెట్‌లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్ జైన్‌కు అద్భుతమైన అవకాశం లభించింది. ఈ తరంలో చాలామంది క్రికెటర్లు ఐపీఎల్‌లో సత్తాచాటి భారత జట్టుకు ఎంపిక అవుతున్నారు. కానీ.. జైన్ కెరీర్ మాత్రం కాస్త భిన్నంగా సాగింది.

కొడుకు కల కోసం క్యాన్సర్‌ను దాచిన తండ్రి.. 11 ఏళ్ల నిరీక్షణకు ఫలితం!
Saransh Jain

స్పోర్ట్స్ డెస్క్: చాలా మంది కష్టపడుతూ అవకాశం కోసం కొంత సమయం మాత్రమే ఎదురు చూస్తుంటారు. కానీ ఇంకొందరు మాత్రం అవకాశం వచ్చే వరకు పోరాడుతూనే ఉంటారు. చివరకు అనుకున్నది సాధించి.. చరిత్రలో నిలుస్తారు. అలాంటి వారి జాబితాలో నిలుస్తాడు టీమిండియా క్రికెటర్ సరాంశ్ జైన్. దేశవాళీ క్రికెట్‌లో ఏళ్ల తరబడి నిలకడగా రాణిస్తున్న సరాంశ్‌కు తన కెరీర్‌లోనే అద్భుతమైన అవకాశం లభించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ 33 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్ రెడ్‌బాల్ క్రికెట్‌లో అదరగొట్టి 11 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు.


వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు సరాంశ్ జైన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో అతడికి చోటు దక్కింది. ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత-ఏ జట్టులో సరాంశ్ ఉన్నాడు. లంకతో జరిగిన రెండో టెస్టులో సరాంశ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆరు వికెట్లు పడగొట్టిన జైన్.. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.


మధ్యప్రదేశ్ సీనియర్ జట్టులో స్థానం సంపాదించినప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన సరాంశ్ అన్ని విభాగాల్లో రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తూ.. కీలక సమయాల్లో వికెట్లు తీస్తుంటాడు. అలానే బ్యాటింగ్‌లోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడు. భారత్ ఎ, సెంట్రల్ జోన్ (దులీప్ ట్రోఫీ), రెస్ట్ ఆఫ్ ఇండియా (ఇరానీ ట్రోఫీ) తరఫున రాణించాడు. దీంతో బీసీసీఐ సెలక్టర్ల దృష్టిలో పడి తాజాగా జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.


క్యాన్సర్ విషయాన్ని దాచిన జైన్ తండ్రి:

తన క్రికెట్ కెరీర్ కోసం కుటుంబం ఏ విధంగా అండగా నిలిచిందో తెలిపే ఒక సంఘటనను జైన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 2014లో మధ్యప్రదేశ్ క్లబ్ తరఫున ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు జైన్ తండ్రికి క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందట. సరాంశ్ ఆటపైనే పూర్తిగా దృష్టి సారించడానికి అతడి తండ్రికి జరిగిన క్యాన్సర్ శస్త్రచికిత్స గురించి అప్పుడు కుటుంబసభ్యులు తెలియజేయలేదట. ఇండియాకు వచ్చిన తర్వాతే తన తండ్రి ఆరోగ్యం గురించి తెలిసిందని ఆ ఇంటర్వ్యూలో జైన్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

శ్రీలంకతో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ

తండ్రి బాటలో తనయుడి విజయం.. కామన్వెల్త్‌లో తెలుగు కుర్రాడికి రజతం

Updated Date - Jul 28 , 2026 | 02:51 PM