ఐపీఎల్2026: ముంబై ఇండియన్స్‌ను భయపెడుతున్న వరుణుడు!
ABN , Publish Date - May 10 , 2026 | 03:36 PM
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ రాయ్‌పుర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన బెంగళూరు ఈ సారైనా పుంజుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లాలని భావిస్తోంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ(ఆదివారం) రాయ్‌పుర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన బెంగళూరు ఈ సారైనా పుంజుకుని పాయింట్ల పట్టికలో టాప్‌లోకి వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు, సాంకేతికంగా మాత్రమే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ముంబైకి ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇందులో ఓడితే ఆ జట్టు అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించే అవకాశం ఉంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబైని వరుణుడు భయపెడుతున్నాడు.
శనివారం సాయంత్రం రాయ్‌పుర్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో రెండు జట్ల ప్రాక్టీస్‌ల సెషన్‌లకు అంతరాయం కలిగింది. ఆదివారం వాతావరణం మెరుగుపడినప్పటికీ సాయంత్రం వేళ వర్షం కురిసే చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. అప్పుడు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచినా.. ముంబై ఖాతాలోకి 13 పాయింట్లే వస్తాయి. ఐపీఎల్‌లో 10 జట్లు పోటీలో ఉన్నప్పుడు 13 పాయింట్లతో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ చేరలేదు.
ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడింది. ఆరింట గెలిచి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అలానే ముంబై ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడింట మాత్రమే గెలిచి..చివరి నుంచి రెండో స్థానలో ఉంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటివరకు 35 సార్లు తలపడగా.. ముంబై 19, బెంగళూరు 16 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. ఈ సీజన్‌లో వాంఖడేలో హార్దిక్ సేనతో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. మొత్తంగా ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి.. ప్లే ఆఫ్స్ సజీవంగా నిలుపుకోవాలని భావిస్తున్న ముంబై జట్టును, వారి అభిమానులను వరుణుడు భయపెడుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
రషీద్ ఖాన్ ఖాతాలో మరో అరుదైన మైలురాయి
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన పాకిస్థాన్ స్టార్ ప్లేయర్