తెలంగాణపై బీజేపీది సవతి తల్లి ప్రేమ: ప్రభుత్వ వీప్
ABN , Publish Date - May 10 , 2026 | 03:15 PM
తెలంగాణపై మొదటి నుంచి బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ 12 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు తీసుకువచ్చిన నిధులు ఎంతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్, మే10: తెలంగాణపై మొదటి నుంచి బీజేపీ సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఈ 12 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు తీసుకువచ్చిన నిధులు ఎంతో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాగానే ఏడు మండలాలను ఆంధ్రాకు కేటాయించారని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పారు.. కాని ఆ తర్వాత ఆ ఊసే లేదని బీజేపీ నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో శరవేగంతో పనులు జరుగుతున్నాయని వివరించారు.
మా పాలమూరు బిడ్డలు భారతదేశంలో లేరా? ఎందుకంత నిర్లక్ష్యం అని కేంద్రంలోని సర్కార్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. గుజరాత్‌లో గిప్టు సిటీ ఏర్పాటు చేసి.. పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు కూడా రాయితీ ఇస్తే బాగుండేది.. కాని తీరని అన్యాయం చేశారంటూ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణకు కేంద్రం సహకారం లేకపోవడంతో సొంత నిధులతో చేపట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీని చూడగానే తెలంగాణ బీజేపీ నాయకులు నోరుమెదపడం లేదని వ్యంగ్యంగా అన్నారు. కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, నిధులు అన్నింట్లో ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే.. తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీకి నిధుల వరద పారుతోందని గుర్తు చేశారు. ఎంపీలను గెలిపించిన తెలంగాణను మాత్రం పట్టించుకోవడం లేదంటూ కేంద్రంలోని బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
బీజేపీ ఎంపీల నోరు పెద్దదని.. ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం నిధులు, ప్రాజెక్టులు తీసుకువద్దామన్న ఆలోచన చేయడం లేదంటూ బీజేపీ ఎంపీలకు చురకలంటించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు అనేక అడ్డంకులు కల్పించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ఏటీఎం సెంటర్ అని, కేసీఆర్ కుటుంబం అవినీతిమయం అని ప్రధాని మోదీ అనేక సార్ల పేర్కొన్నారని తెలిపారు. దేశంలోనే అత్యధిక అవినీతి కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మోదీ విమర్శించారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై ఈగ కూడా వాలనివ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒక్క కేసుపైన కూడా విచారణ జరపలేదని వివరించారు. వంద రోజుల్లో కేసీఆర్‌ను జైలులో వేస్తామని బీజేపీ నాయకులు అన్నారని గుర్తు చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ బలం ఫెవికాల్ కంటే ధృడమైనదని అభివర్ణించారు. గతంలో కేంద్రం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. కేసీఆర్ కుటుంబంపై ఐటీ, ఈడీ, సీబీఐలు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యలో అనేక సంస్కరణలు తీసుకు వస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎందుకు సహకరించడం లేదు..? అని సందేహం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి నుంచి ఎడ్యుకేషన్‌కు సంబంధించిన రుణాలను మినహాయించాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.
అమరావతి నిర్మాణం కోసం వేల కోట్లు ఇస్తున్న కేంద్రం భారత్ ప్యూచర్ సీటికి రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. ప్యూచర్ సీటి నిర్మాణానికి బీజేపీ నాయకులు అడ్డు పడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ తోకపట్టుకుని కూర్చీలో కూర్చోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుందన్నారు. అవినీతి బీఆర్ఎస్ నాయకులను జైలులో పెట్టాలన్న ఆలోచన బీజేపీకి లేదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర హితం కోసం ఆలోచడం లేదని తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని ప్రభుత్వ విప్ యెన్నెం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్
ప్రధానిపై టీబీజేపీ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలి: అద్దంకి దయాకర్
For More TG News And Telugu News