Share News

వైభవ్‌కి దిష్టి తగలకుండా చూసుకోండి: అశ్విన్

ABN , Publish Date - May 28 , 2026 | 08:07 PM

రాజస్థాన్ రాయల్స్ యువ సంచనలం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.

వైభవ్‌కి దిష్టి తగలకుండా చూసుకోండి: అశ్విన్
Ravichandran Ashwin

స్పోర్ట్స్ డెస్క్: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఈ పేరు క్రికెట్ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ యువ సంచనలం ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిస్తున్నాడు. బుధవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి... త్రుటిలో ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. వైభవ్‌కు దిష్టి తగలకుండా చూసుకోవాలని అతడి తల్లిదండ్రులకు సూచిస్తూ సరదాగా వ్యాఖ్యానించాడు. 15 ఏళ్ల వయసులోనే వైభవ్ మానసిక పరిపక్వతపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.


తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అశ్విన్ మాట్లాడుతూ.. 'వైభవ్ సూర్యవంశీ వయసును సాకుగా చూపించదలచుకోలేదు. కానీ 15 ఏళ్ల వయసులోనే అతడు ఈ స్థాయి మానసిక పరిపక్వత పొందడం ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని తక్కువ మ్యాచ్‌ల్లోనే అతను ఆడుతున్న విధానం చూడముచ్చటగా ఉంది. థర్డ్ మ్యాన్ పై నుంచి వైభవ్ కొట్టిన సిక్సర్‌ను చూస్తే.. ఈ సీజన్ ప్రారంభంలో అదే బంతిని స్ట్రైట్‌గా ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఒక సీజన్ లోనే చిన్న వయసులోనే వైభవ్ తన బ్యాటింగ్‌లో మార్పులు చేసుకున్నాడు. ఇప్పుడు వాటన్నింటినీ వైభవ్ తన బ్యాటుతోనే సమాధానమిచ్చాడు' అని అశ్విన్ తెలిపాడు.


'వైభవ్ చాలా ప్రత్యేకమైన ఆటగాడు. సూర్యవంశీకి దిష్టి తగలకుండా అతడి తల్లిదండ్రులు ఏమైనా చేయాలి. మ్యాచ్ అనంతరం సెంచరీ గురించి తాను పట్టించుకోలేదని వైభవ్ చెప్పాడు. కేవలం జట్టు కోసం విజయాన్ని అందించేందుకే ప్రయత్నించానని చెప్పాడు. అతని బ్యాటింగ్ చేసే విధానం చూస్తే.. సెంచరీ గురించి వైభవ్ పట్టింపు లేదని తెలుస్తోంది. ఒత్తిడిలో అతడు ఎలా ఆడతాడనే దానిపై సందేహం ఉండేది' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

కేన్‌ విలియమన్స్‌ వరల్డ్ రికార్డ్

వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్

Updated Date - May 28 , 2026 | 09:21 PM