మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!
ABN , Publish Date - May 28 , 2026 | 07:22 PM
మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు.
అమరావతి, మే 28: మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17.50 లక్షల మంది హాజరుకావడం విశేషం.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు గతంలో ఆస్తి హక్కు కల్పించిన ఘనత టీడీపీదేనని, ఇప్పుడు వారికి రాజకీయ స్వేచ్ఛను కూడా తమ పార్టీయే అందిస్తుందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రం పరిధిలో అన్ని పార్టీలు దీనికి అంగీకరించకపోయినా, తమ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చే మహిళా బిల్లుకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
ఒకప్పుడు వరకట్నం ఇవ్వడం భారంగా ఉండేదని, కానీ నేడు ఆడపిల్లలకు ‘రివర్స్ డౌరీ’ ఇచ్చే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళలు రాజకీయంగా ముందుండాలని, వారిని నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 'ఆడబిడ్డల జోలికి వస్తే అదే మీకు చివరి రోజు' అని ఇదే వేదికగా ప్రతిపక్షాలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు
ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని