ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు: కేంద్ర మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - May 28 , 2026 | 04:20 PM
రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.
అమరావతి, మే 28: రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరి అని నమ్మిన నాయకుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం రాజధాని అమరావతిలో టీడీపీ నిర్వహించిన మహానాడులో రాష్ట్రానికి కేంద్ర సహాయం అనే తీర్మానంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి కోసం రూ.15,000 కోట్లు కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిందని వివరించారు. చరిత్రలో ఎవరూ కదిలించలేని విధంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చామని గుర్తు చేశారు. సంకెళ్లతో అమరావతిని గొడ్డలి పార్టీ బంధిస్తే.. సంకల్పంతో అమరావతిని సాధించామని స్పష్టం చేశారు.
గోదావరి నీళ్లు సముద్రంలో కాకుండా రైతు జీవితాల్లో కలవాలనే లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 2014-19లోనే పోలవరం పనులు 70 శాతం పూర్తి చేశామని.. కానీ గత వైసీపీ ప్రభుత్వం 5 శాతం పనులు మాత్రమే చేసిందని సోదాహరణంగా ఆయన వివరించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి 30 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు కోసం కేంద్రం రూ.11,400 కోట్లు సాయం చేసిందని వివరించారు. ఉక్కును కరిగించవచ్చు కానీ.. ఆంధ్రుల సంకల్పాన్ని వైఎస్ జగన్ కరిగించలేడన్నారు.
నాడు పంచాయతీ రాజ్ శాఖమంత్రిగా నారా లోకేశ్.. గ్రామాల్లో సీసీ రోడ్లు వేయడానికి ఎంతో కృషి చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం పథకాలు సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రూ.12,000 కోట్లు చెల్లించి సుమారు 82 కేంద్ర పథకాలను పునరుద్ధరించామని వివరించారు. అమృత్ స్కీమ్ కింద కొత్తగా 2 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇచ్చామన్నారు. నీళ్లు అందించడం సంక్షేమం కాదని.. ప్రభుత్వాల బాధ్యత అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించలేక పోయారని పేర్కొన్నారు.
ఈ రెండేళ్లలో రూ.20,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రానికి తీసుకొచ్చామని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. 316 ఆర్వోబీ పాంట్లు,16 వందే భారత్ రైళ్లు, 73 అమృత్ భారత్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.2,500 కోట్లతో అమరావతిలో రైల్వే ప్రాజెక్టు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించామని చెప్పారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆ ఐదేళ్లలో భోగాపురం ఎయిర్ పోర్టు కోసం కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేస్తే... కూటమి ప్రభుత్వం రూ.4,000 కోట్లు ఖర్చు చేసి ప్రారంభానికి సిద్ధం చేసిందని వివరించారు. పూర్వోదయ పథకం కింద రాయలసీమలో రూ.40 వేల కోట్లతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తున్నామన్నారు. గూగుల్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ముద్ర వేసిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు మరో రికార్డు: నారా లోకేశ్
మహాలక్ష్మికి స్మార్ట్ కార్డులు..
For More AP News And Telugu News