అకస్మాత్తుగా ఇంటికి పోలీసులు.. షాకైన అశ్విన్
ABN , Publish Date - Aug 14 , 2026 | 03:31 PM
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంటికి పోలీసులు వచ్చారు. అయితే వారు రావడానికి గల కారణాన్ని తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అశ్విన్ వివరించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ క్రికెటర్, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకుడిగా, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రికెట్‌కు సంబంధించిన విషయాలను, ఇతర అంశాలను విశ్లేషిస్తూ.. తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటాడు. ఎప్పటిలాగే తన ఛానల్ కోసం వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో అశ్విన్ ఇంటికి పోలీసులు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అశ్విన్ వెల్లడించాడు.
తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'నేను వీడియో రికార్డ్ చేస్తుండగా మా ఇంటి సెక్యూరిటీ గార్డు వరుసగా మూడు, నాలుగు సార్లు ఫోన్ చేశాడు. అతడు సాధారణంగా అన్ని సార్లు కాల్ చేయడు. నేను వీడియో రికార్డింగ్ లో నిమగ్నమై ఆ కాల్స్ పట్టించుకోలేదు' అని తెలిపాడు.
'అదే సమయంలో నా భార్య కూడా ఫోన్ చేసింది. దీంతో ఏదో ముఖ్యమైన విషయం ఉండటంతోనే వారు కాల్ చేసినట్లు నాకు అనుమానం వచ్చింది. నా భార్యకు తిరిగి ఫోన్ చేయగా.. ఇంటికి పోలీసులు వచ్చారని తెలిపింది. దీంతో నేను ఒక్కసారిగా షాక్ గురయ్యాను. నేను వాళ్ల వద్దకు వెళ్లగా.. నా పాస్ పోర్ట్ ఇవ్వడానికి వచ్చారని అర్ధమైంది. నేను వీసా కోసం పాస్ పోర్టును సమర్పించా.. అదే తిరిగి ఇచ్చేందుకు పోలీసులు వచ్చారు' అని అశ్విన్ వివరించాడు.
మీలాంటి సెలబ్రిటీలకు కూడా ఇలాంటి సాధారణ ఘటనలు జరుగుతాయా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ‘నేను ఒక సాధారణ వ్యక్తిలా జీవించాలనుకుంటాను. అందుకే సాధారణ జీవితాన్నే ఇష్టపడతాను’ అని అశ్విన్ సమాధానం ఇచ్చాడు. అశ్విన్ 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత 2025లో ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలికాడు. భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో 287 మ్యాచ్‌ల్లో 765 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి:
రేపు శ్రీలంకతో పోరుకు భారత్ రెడీ.. గిల్ కీలక వ్యాఖ్యలు