Share News

స్మార్ట్ రేషన్‌ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టరు?: ఎంపీ రఘునందన్ రావు..

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:01 PM

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ రేషన్‌ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.

స్మార్ట్ రేషన్‌ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టరు?: ఎంపీ రఘునందన్ రావు..
MP Raghunandan Rao

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసే స్మార్ట్ రేషన్‌ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఫొటో కచ్చితంగా పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం తన వాటా కింద ఇచ్చే బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని రఘునందన్ రావు ఆక్షేపించారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఆరు కిలోల బియ్యంలో ఐదు కిలోలు కేంద్రం ఇస్తున్నవేనని ఎంపీ పేర్కొన్నారు. ఒక్క కిలో బియ్యం ఇస్తూ కార్డుపై ముగ్గురు కాంగ్రెస్ నేతల ఫొటోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలతో స్మార్ట్ రేషన్‌ కార్డులు ఇవ్వడాన్ని రఘునందన్ రావు ఆక్షేపించారు. మోదీ ఫొటో లేకపోవడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 1.06 కోట్ల రేషన్ కార్డుల పంపిణీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సుమారు 90 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయని, కొత్తగా ఎన్ని ఇస్తున్నారో ప్రభుత్వం వెల్లడించాలన్నారు.


రేషన్‌ కార్డుల ముద్రణ ఖర్చులు, టెండర్ల వివరాలు బయటపెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంపీ డిమాండ్ చేశారు. కార్డుల ముద్రణ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారనే వివరాలను వెల్లడించాలన్నారు. అదేవిధంగా, రేషన్‌ డీలర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, వారికి గౌరవ వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. పెంచిన రేషన్‌ డీలర్ల కమిషన్‌ను వెంటనే ఇవ్వాలని, బియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయన్న ఫిర్యాదులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా రేషన్‌ కార్డుల ద్వారా తెలంగాణలోని పేదలకు మరిన్ని నిత్యావసర సరకులు అందించాలని సూచించారు. కర్ణాటక తరహాలో కందిపప్పు, నూనె, రాగులు, చక్కెర, గోధుమలు ఇవ్వాలని.. బియ్యం వద్దనుకునే వారికి ప్రత్యామ్నాయ ఆహార ధాన్యాలు అందించాలన్నారు. పేదల ఆహార భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని అన్నారు. అలాగే, రేషన్‌ కార్డుల పంపిణీని పునఃపరిశీలించాలని, మోదీ ఫొటోతో కొత్త కార్డులు ముద్రించాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఆ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం

Updated Date - Aug 14 , 2026 | 03:06 PM