Share News

ఆటగాళ్లను బూతులు తిట్టడం సరికాదు: అశ్విన్

ABN , Publish Date - May 22 , 2026 | 03:50 PM

ఐపీఎల్ 2026 లీగ్ చివర్లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్-4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే.. ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగింది.

ఆటగాళ్లను బూతులు తిట్టడం సరికాదు: అశ్విన్
Ravichandran Ashwin CSK

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 లీగ్ చివర్లో వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్-4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే.. ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగింది. గురువారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 89 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ భారీ ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌(Ruturaj Gaikwad)ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


రుతురాజ్ గైక్వాడ్‌పై జరుగుతున్న ఈ హేయమైన ట్రోలింగ్‌ను చూసి భారత సీనియర్ స్పిన్నర్, సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రుతురాజ్‌కు మద్దతుగా నిలుస్తూ అభిమానులకు చిన్న హెచ్చరిక చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ చెబుతుంటాను, రుతురాజ్ చాలా మంచి ఆటగాడు. కొందరు వ్యక్తులు అతన్ని ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. రుతురాజ్ లాంటి ఆటగాడిపై ఇలాంటి విమర్శలు మంచిది కాదు. కెరీర్‌లో ఎవరికైనా ఎప్పుడైనా గడ్డు కాలం రావచ్చు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సమయం అందరికీ మారుతుంది. అంతమాత్రానికే ఒక ఆటగాడిని వ్యక్తిగతంగా దూషించడం, ట్రోల్ చేయడం సరైనది కాదు' అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.


ఇక చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఈ స్టార్ స్పిన్నర్ అభిమానులకు ఓ కీలక విజ్ఞప్తి చేశాడు. ధోనీ సారథిగా ఉన్నప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు పెట్టుకునేవారో.. ఇప్పుడు కూడా అలాంటివే ఆశించడం మానుకోవాలని సూచించాడు. ' గత 18 ఏళ్లుగా ధోనీ, సీఎస్కే కలిసి ప్రతిసారీ గెలవడం, ప్లేఆఫ్స్ చేరడం వంటి అలవాట్లను ఫ్యాన్స్‌కు నేర్పించారు. కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో 10 జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఏ జట్టునైనా ఎవరైనా ఓడించగలరు. ఈసారి పాయింట్ల పట్టికలో తనకంటే కింద ఉన్న జట్లపై మాత్రమే సీఎస్కే గెలిచింది. కాబట్టి వారు భవిష్యత్తులో మరింత కష్టపడాలి. అలానే ఈసారి చెన్నై మంచి ప్రదర్శన చేయలేదనే విషయాన్ని అందరూ గ్రహించాలి' అని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.


ఇవి కూడా చదవండి:

మాకు ఆ అవకాశాలు వచ్చినా విఫలమయ్యాం: రుతురాజ్

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

Updated Date - May 22 , 2026 | 04:00 PM