మాకు ఆ అవకాశాలు వచ్చినా విఫలమయ్యాం: రుతురాజ్
ABN , Publish Date - May 22 , 2026 | 03:13 PM
ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. లీగ్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, పునరాగమనం చేసి ప్లేఆఫ్స్ ఆశలు రేకెత్తించిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2026లో మాత్రం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. లీగ్ దశలో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ, పునరాగమనం చేసి ప్లేఆఫ్స్ ఆశలు రేకెత్తించిన రుతురాజ్ గైక్వాడ్ సేన.. కీలకమైన ఆఖరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. గురువారం జరిగిన ఈ నిర్ణయాత్మక పోరులో 230 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై.. కేవలం 13.4 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల తేడాతో ఎదురైన ఈ ఓటమి ఐపీఎల్ చరిత్రలోనే సీఎస్కేకు అత్యంత భారీ పరాజయం కావడం గమనార్హం. వరుసగా ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో చెన్నై లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.
ఓటమి అనంతరం బ్రాడ్‌కాస్టర్‌తో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ తమ వైఫల్యాలను నిజాయితీగా అంగీకరించాడు. 'మొదటి మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తర్వాత అద్భుతంగా కోలుకుని ఆరు మ్యాచ్‌లు గెలిచాం. అయితే కీలక సమయంలో గాయాల బారిన పడటం మా లయను దెబ్బతీసింది. రామకృష్ణ ఘోష్, జేమీ ఓవర్టన్ వంటి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో జట్టు సమతుల్యత దెబ్బతింది. ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో ఒక బ్యాటర్ లేదా బౌలర్ తక్కువతో ఆడాల్సి వచ్చింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలో మా బౌలింగ్ బాగోలేదు. వారిని 200 పరుగుల లోపే కట్టడి చేసే అవకాశం ఉన్నా చేజార్చుకున్నాం' అని రుతురాజ్ వాపోయాడు.
జట్టు ప్రస్తుతం మార్పుల (Transition) దశలో ఉందన్న రుతురాజ్.. అనుభవజ్ఞులైన అజింక్యా రహానే, అంబటి రాయుడు వంటి సీనియర్ల స్థానాల్లో కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్, డెవాల్డ్ బ్రెవిస్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చామన్నాడు. జట్టులోని ఎనిమిది మంది కంటే ఎక్కువ మంది ఆటగాళ్లకు 20 కంటే తక్కువ మ్యాచులు ఆడిన అనుభవమే ఉందని, ఈ సీజన్ ద్వారా జట్టులోని లోపాలను గుర్తించామని చెప్పాడు. హోమ్ గ్రౌండ్‌లో ఇబ్బంది పడ్డా.. విదేశీ మైదానాల్లో ఆరు విజయాలు సాధించడం గర్వంగా ఉందన్నాడు.
మరోవైపు రుతురాజ్‌కు చెన్నై సూపర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్ గురించి ప్రశ్న ఎదురైంది. అందుకు రుతురాజ్ బదులిస్తూ...'ఆ విషయం వచ్చే ఏడాది మీకూ, నాకూ కలిసే తెలుస్తుంది. ధోనీ ఆలోచనలు ఆయనకు మాత్రమే తెలుసు. అయితే మ్యాచ్ ఆఖరి ఓవర్లలో క్రీజులో ఉండి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ధోనీ లేకపోవడం జట్టుకు పెద్ద లోటే' అంటూ గైక్వాడ్ ఆసక్తికరంగా సమాధానమిచ్చాడు. 19 సీజన్ల ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..
ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్