Share News

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

ABN , Publish Date - May 22 , 2026 | 02:59 PM

భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్‌లో చోటుచేసుకుంది.

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..
Sangareddy Crime News

సంగారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన హత్నూర మండలం దౌలాపూర్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 14న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2018లో మెదక్ జిల్లా కొల్చారం మండలం నాయిని జలాల్‌పూర్‌కు చెందిన నాగరాజుకు దౌలాపూర్ గ్రామానికి చెందిన లావణ్యతో వివాహం జరిగింది.


కొన్నేళ్ల పాటు నాగరాజు, లావణ్యల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగింది. ఈ మేరకు వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత మద్యానికి బానిసైన నాగరాజు అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. దీంతో కొన్ని నెలల క్రితం లావణ్య ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెకు పలుమార్లు ఫోన్ చేసిన నాగరాజు.. కాపురానికి రావాలని, లేకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగాడు. భార్య తన మాట వినకపోవడంతో ఈ నెల 14న అర్ధరాత్రి దౌలాపూర్ గ్రామానికి వెళ్లిన నాగరాజు.. బయట నుంచి అత్తారింటి తలుపులకు గడియ పెట్టాడు. అనంతరం ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


తర్వాత భార్యకు వీడియో కాల్ చేసి నిప్పుపెట్టిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఇంట్లో ఉన్న భార్య, అత్తమామలు, ఇద్దరు పిల్లలు భయాందోళనలకు గురయ్యారు. ఇల్లు మంటల్లో కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. లోపల ఉన్నవారిని రక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసిన హత్నూర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో నాగరాజే నిప్పంటించినట్లు నిర్ధారణ అయింది. నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

Updated Date - May 22 , 2026 | 03:18 PM