Share News

తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బ్యాంకులు భాగస్వాములు కావాలి: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 22 , 2026 | 01:46 PM

తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మంత్రి ప్రసంగించారు.

తెలంగాణలో గ్రామాల అభివృద్ధికి బ్యాంకులు భాగస్వాములు కావాలి: మంత్రి తుమ్మల
Tummala Nageswara Rao,

హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో బ్యాంకులు చురుకైన భాగస్వాములు కావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. బ్యాంకర్లు కేవలం సాంప్రదాయ పంట రుణాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రుణాల పంపిణీని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గ్రామీణ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని, ఈ అవకాశాన్ని బ్యాంకులు ఉపయోగించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘తెలంగాణలో క్రెడిట్-డిపాజిట్ (CD) నిష్పత్తి రికార్డు స్థాయిలో 130.78 శాతం నమోదు కావడం గొప్ప విశేషం. ప్రస్తుతం రాష్ట్రంలో బ్యాంక్ డిపాజిట్లు రూ.9.43 లక్షల కోట్లుగా ఉంటే, అడ్వాన్సులు (రుణాలు) రూ.12.33 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది. నిర్ణీత లక్ష్యం కంటే ఎక్కువగా 102 శాతం ప్రగతిని నమోదు చేయడం హర్షణీయం. రాష్ట్రంలో పంట రుణాల పంపిణీ రూ.75,486 కోట్లకు చేరిందని, వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.1.68 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందజేశాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రుణ సంస్కృతి తిరిగి పునరుద్ధరించబడింది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల బ్యాంకులలో వ్యవసాయ నిరర్ధక ఆస్తులు (మొండి బకాయిలు) 5.23 శాతం నుంచి 4.71 శాతానికి తగ్గాయి. తెలంగాణలో ఉద్యానవన రంగంతో పాటు ఆయిల్ పామ్ సాగుకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ రంగాలకు బ్యాంకులు పెద్దపీట వేయాలి. పంట నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, సైలోల నిర్మాణానికి బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలి. అలాగే రాష్ట్రంలో ఉన్న దాదాపు వెయ్యి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తగిన ఆర్థిక మద్దతు అందించాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉంది. వ్యవసాయాన్ని ఆధునికీకరించేందుకు, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు గానూ ప్రభుత్వం రూ.147.91 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. కౌలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పంట రుణాలు అందేలా బ్యాంకులు బాధ్యత తీసుకోవాలి. వీటితో పాటూ పర్యావరణ హితమైన సోలార్ వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు రుణ సదుపాయాన్ని గణనీయంగా పెంచాలి’ అని మంత్రి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం: హరీశ్ రావు

ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్న రైతులు: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 22 , 2026 | 01:56 PM