Share News

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..

ABN , Publish Date - Feb 18 , 2026 | 02:03 PM

రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు బెంగాల్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో 67 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఫైనల్స్‌లోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది.

చరిత్ర సృష్టించిన జమ్మూకశ్మీర్ జట్టు.. 67 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..
Ranji Trophy 2026

స్పోర్ట్స్ డెస్క్: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 67 ఏళ్ల ఆ జట్టు చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీలో ఫైనల్‌కు చేరింది. సెమీ ఫైనల్‌లో బెంగాల్ జట్టును ఓడించి.. జమ్మూకశ్మీర్ ఫైనల్‌కి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన జమ్మూకశ్మీర్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది.


బెంగాల్ బ్యాటర్లలో సుదీప్ కుమార్ ఘరామి (146) శతకంతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూకశ్మీర్‌ 302 పరుగులకే ఆలౌటైంది. అబ్దుల్‌ సమద్‌(82), పరాస్‌ డోగ్రా (58) రాణించారు. దీంతో బెంగాల్ జట్టు 26 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. భారత జట్టు పేసర్ మహమ్మద్ షమీ బెంగాల్‌ తరఫున విజృంభించాడు. అతడు 90 పరుగులు ఇచ్చి..8 వికెట్లు సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు హోరాహోరీగా పోటీ పడ్డాయి.


అయితే రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌ పేస్‌ దాటికి బెంగాల్‌ బ్యాటర్లు బెంబేలెత్తారు. దీంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. షాబాజ్‌ అహ్మద్‌ 24 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక జమ్మూకశ్మీర్‌ బౌలర్లు ఔకిబ్ నబీ, సునీల్ కుమార్ చెరో నాలుగు వికెట్లు తీసి.. బెంగాల్‌ పతనాన్ని శాసించారు. అలానే యుద్వీర్‌సింగ్ చరక్‌ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక 126 పరుగుల టార్గెట్‌‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్మూ కశ్మీర్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.


జమ్మూకశ్మీర్ బ్యాటర్లలో వంశజ్ శర్మ (84 బంతుల్లో 43* పరుగులు) అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అబ్దుల్‌ సమద్‌(30*), శుభమ్ పుండిర్ (27) ఫర్వాలేదనిపించారు. శుభమ్‌ ఖజురియా (1), యావెర్‌ హసన్‌ (6), కెప్టెన్‌ పరాస్‌ డోంగ్రా (9) బ్యాటింగ్‌లో విఫలమయ్యారు. బెంగాల్‌ బౌలర్లలో ఆకాశ్‌ 3 సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు సాధించిన మహ్మద్‌ షమీ.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 1 వికెట్‌ మాత్రమే తీసుకున్నాడు. ఇక బెంగాల్‌పై విజయంతో జమ్మూకశ్మీర్ హిమాలయ ప్రాంతం నుంచి ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా అవతరించింది.


జమ్మూకశ్మీర్ జట్టు తొలిసారి1959-60 సీజన్‌లో రంజీ ట్రోఫీలో పాల్గొంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ గట్టిపోటీ ఇచ్చే జట్టుగా జమ్మూకశ్మీర్ కనిపించలేదు. అయితే దశాబ్దాల తర్వాత 2013-14 సీజన్‌లో తొలిసారిగా నాకౌట్‌లకు అర్హత సాధించారు. ఈ సీజన్‌లో మరో సెమీఫైనల్‌లో కర్ణాటక, ఉత్తరాఖండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో జమ్మూకశ్మీర్‌ ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఫైనల్‌లో తలపడనుంది.


సంక్షిప్త స్కోర్లు:

బెంగాల్:

తొలి ఇన్నింగ్స్: 328/10, రెండో ఇన్నింగ్స్: 99/10

జమ్మూకశ్మీర్:

తొలి ఇన్నింగ్స్: 302/10, రెండో ఇన్నింగ్స్: 126/4


ఇవీ కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన యువరాజ్.. ప్రపంచ రికార్డు

ఇలాంటి సిక్స్ ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్

Updated Date - Feb 18 , 2026 | 02:47 PM