టీ20 ప్రపంచ కప్ 2026: ధోనీ రికార్డ్ సమం చేసిన డికాక్
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:03 PM
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన ఘనతను సాధించాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్(Quinton de Kock) టీ20 ప్రపంచ కప్ 2026లో అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీమిండియా దిగ్గజ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ప్రపంచ రికార్డును డికాక్ సమం చేశాడు. మరి.. డికాక్ సాధించిన ఆ రికార్డ్ వివరాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా గ్రూప్-డిలో ఉన్న సౌతాఫ్రికా, కెనడా జట్లు సోమవారం తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా.. సఫారీలను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 156 పరుగులకు పరిమితమైంది. దీంతో సౌతాఫ్రికా 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సఫారీ పేసర్ లుంగీ ఎంగిడి 4 వికెట్లతో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండు డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో కెనడా ఓపెనర్లు కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా(0), యువరాజ్ సమ్రా(12) ఇచ్చిన క్యాచ్‌లను డికాక్ అందుకున్నాడు. తద్వారా టీ20 ప్రపంచకప్ లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డును డికాక్ సమం చేశాడు.
టీ20ల్లో 100కి పైగా ఔట్లు చేసిన ఏకైక కీపర్
టీ20 ఫార్మాట్లో 100 కంటే ఎక్కువ ఔట్లలో పాలుపంచుకున్న ఏకైక వికెట్ కీపర్ డికాక్ నిలిచాడు. 103 మ్యాచ్‌ల్లో అతను 110 ఔట్లు(91 క్యాచ్‌లు, 19 స్టంపింగ్‌లు) చేశాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్(93), టీమిండియా దిగ్గజ కెప్టెన్ ధోని(91) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
T20 WC: అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్లు వీరే..
క్వింటన్ డికాక్(సౌతాఫ్రికా) - 32
ఎంఎస్ ధోనీ(భారత్) - 32
కమ్రాన్ అక్మల్(పాకిస్థాన్) - 30
దినేశ్ రామ్‌దిన్(వెస్టిండీస్) - 27
కుమార్ సంగక్కర(శ్రీలంక) - 26
జోస్ బట్లర్(ఇంగ్లండ్) - 26
Also Read:
టీ20 ప్రపంచకప్-2026: బంగ్లా జట్టుకి భారీ ఊరట..
టీ20 ప్రపంచకప్2026 వేళ బీసీసీఐ కీలక నిర్ణయం..!