Share News

ఖవాజా శాండ్ పేపర్ లీక్స్.. భార్యతో గొడవపడిన ప్యాట్ కమిన్స్! వీడియో...

ABN , Publish Date - Nov 12 , 2026 | 12:57 PM

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆటోబయోగ్రఫీ 'సబర్‌'లో వెల్లడించిన సంచలన విషయాలు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అతడి భార్య బెక్కీ గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఖవాజా శాండ్ పేపర్ లీక్స్.. భార్యతో  గొడవపడిన ప్యాట్ కమిన్స్! వీడియో...
Pat Cummins

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా తన ఆటోబయోగ్రఫీ 'సబర్‌'లో వెల్లడించిన సంచలన విషయాలు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు మాయని మచ్చగా నిలిచిపోయిన 2018 బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం గురించి ఖవాజా సంచలన విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఖవాజా వ్యాఖ్యలకు ఒక్కో ఆసీస్ ఆటగాడు బయటకు వచ్చి వివరణ ఇస్తున్నారు.


ఇప్పటికే ఖవాజా చెప్పింది 100 శాతం నిజమని డేవిడ్ వార్నర్ వీడియోను షేర్ చేశాడు. మిచెల్ స్టార్క్ ఈ వ్యాఖ్యలను ఖండించాడు. టాంపరింగ్ గురించి తనకు అయితే తెలియదని, ఖవాజా వివరణ ఇవ్వాలంటూ విమర్శించాడు. తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ప్రెస్‌ మీట్ పెట్టి వివరణ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ఖవాజా ఆరోపణలపై సమాధానమిచ్చేందుకు కమిన్స్ శుక్రవారం సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్ హాల్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మేరకు మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఈ ఆరోపణల తీవ్రతను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నానని కమిన్స్ చెప్పాడు.


మరోవైపు ఈ ‌పోస్ట్‌కు ముందు కమిన్స్ , అతడి భార్య బెక్కీ మధ్య వాగ్వాదం జరిగిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇద్దరూ ఏ విషయంపై గొడవపడ్డారో తెలియదు కానీ.. సరిగ్గా మీడియా సమావేశానికి ముందే గొడవపడటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ది ఆస్ట్రేలియా న్యూస్ పేపర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. కమిన్స్, బెక్కీ ఒక ప్రాపర్టీ సమీపంలో గొడవపడుతూ కనిపించారు. టీ షర్ట్, షార్ట్స్ ధరించిన కమిన్స్.. బెక్కీ అరుస్తుండగా మౌనంగా నిలబడ్డాడు. వారి వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. కమిన్స్ భార్య కూడా స్పందించారు.


భర్త, వారి కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె ఆ ఫోటోకు 'నా ప్రియమైనవారు' అని క్యాప్షన్ పెట్టింది. కమిన్స్, బెక్కీ తొలిసారి కింగ్స్ క్రాస్‌లోని ఒక బార్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత 2013 నుంచి కలిసి ఉన్నారు. మరోవైపు న్యూజిలాండ్‌తో నాలుగు టెస్ట్‌ల సిరీస్ కోసం కమిన్స్ సన్నదమవుతున్నాడు. ఈ సిరీస్ కోసమే అతను ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అయితే బాల్ టాంపరింగ్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిగిందని గతంలోనే కమిన్స్ వెల్లడించాడు.


ఇవీ చదవండి

బిహార్‌లో దారుణం.. అత్యాచార బాధితురాలిని మేడపై నుంచి తోసేసిన దుండగులు

ఆలూ, బీట్‌రూట్‌తో రుచికరమైన హల్వా.. తయారీ విధానం ఇదిగో!

వంటలు: స్పైసీ చికెన్‌ వేపుడు

Updated Date - Nov 12 , 2026 | 01:42 PM