టీ20 ప్రపంచ కప్ 2026: నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం
ABN , Publish Date - Feb 07 , 2026 | 02:51 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. ఇవాళ(శనివారం) నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది.148 పరుగుల లక్ష్యాన్ని మూడు బంతులు మిగిలి ఉండగానే అందుకుంది. అయితే పసికూన అయిన నెదర్లాండ్స్ కూడా పాక్ కు గట్టి పోటీ ఇచ్చింది. గెలుపు కోసం నెదర్లాండ్స్ బౌలర్లు తీవ్రంగా శ్రమించి విఫలమయ్యారు. చివర్లో ఫహీమ్ అష్రఫ్ దూకుడుగా ఆడి.. పాక్‌కు విజయాన్ని అందించాడు.
టీ-20 ప్రపంచ కప్(World Cup-2026)లో భాగంగా కొలంబో వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. పాక్ బౌలర్ల ధాటికి 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో స్కాట్ ఎడ్వర్డ్స్ (37) , బాస్ డీ లీడే (30) రాణించారు. మైఖేల్ లెవిట్ (24), కోలిన్ అకెర్మాన్ (20) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. షాహీన్ అఫ్రిది ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్(Pakistan) 19.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. టార్గెట్‌ను అందుకుంది. పాక్ బ్యాటర్లలో సాహిబ్దాదా ఫర్హాన్(47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫహీమ్ అష్రఫ్(29), అయూబ్(24) ఫర్వాలేదనిపించారు. బాబర్ అజామ్ 15 పరుగులు మాత్రమే చేశాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ తలో రెండు వికెట్లు తీశారు. కైల్ క్లెన్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే తలో ఒక వికెట్ సాధించారు. నెదర్లాండ్స్(Netherlands) లాంటి పసికూనపైనా 148 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు పాకిస్థాన్ తీవ్రంగా శ్రమించింది. ఒకానొక దశలో ఏడు వికెట్లు కోల్పోయి.. 20 బంతుల్లో 33 పరుగులు చేయాల్సిన స్థితిలో పాకిస్థాన్ పడింది. చివర్లో షహీమ్ అప్రఫ్(11 బంతుల్లో 29) చెలరేగి ఆడి.. పాకిస్థాన్‌ను విజయ తీరాలకు చేర్చాడు. అంతేకాక 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డునూ అందుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్
టీ20 ప్రపంచకప్ వేళ గూగుల్ ప్రత్యేక డూడుల్..