Share News

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:53 PM

టీ20 ప్రపంచ కప్2026 టోర్నీలో సూపర్-8లో భాగంగా రేపు భారత్, సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌కు చేరాలంటే సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఈ క్రమంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

టీ20 ప్రపంచ కప్ 2026: భారత్‌కు భారీ ఎదురు దెబ్బ
Mohammed Siraj injury

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నేటి నుంచి సూపర్-8 ప్రారంభం కానుంది. రేపు(ఆదివారం)అహ్మదాబాద్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్ దశలో అదరగొట్టిన సూర్య సేన.. సూపర్ 8లోనూ అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు చేరాలనే పట్టుదలతో ఉంది. అహ్మదాబాద్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు.. శనివారం ప్రాక్టీస్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు టీమండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే...


ఇవాళ(శనివారం)భారత ఆటగాళ్లు నరేంద్ర మోదీ స్డేడియలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) బాదిన బంతి సిరాజ్‌ ఎడమ మోకాలికి బలంగా తాకిందని సమాచారం. నొప్పితో విలవిల్లాడిన సిరాజ్‌ మధ్యలోనే నెట్‌ సెషన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రేవ్ స్పోర్ట్స్ గ్లోబల్ ఎక్స్ లో షేర్ చేసిన ఫొటోల్లో సిరాజ్‌ కుంటుతూ మైదానం వీడుతూ కనిపించాడు. ఇది టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.


మరోవైపు టీ20 వరల్డ్‌కప్‌(T20 World Cup 2026) టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ భారత జట్టును గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. బౌలింగ్ ఆల్ రౌండర్ హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. అమెరికాతో జరిగిన మ్యాచ్ సిరాజ్‌కు అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.


అలానే ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ(Abhishek Sharma) సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. తొలి మూడు మ్యాచ్‌లకు దూరంగానే ఉన్నాడు. వీరి గాయాలే అందరినీ ఆందోళనకు గురి చేస్తుంటే.. తాజాగా పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ కూడా గాయపడటం టీమిండియాను మరింత కలవరపెడుతుంది.


ఇవి కూడా చదవండి:

మళ్లీ భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్! పూర్తి వివరాలు ఇవే...

ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్

Updated Date - Feb 21 , 2026 | 03:40 PM