ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని ఊహించలేదు: బంగ్లా అసిస్టెంట్ కోచ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:09 PM
టీ20 ప్రపంచకప్ 2026 వివాదం నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. ఆదేశ మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై నిప్పులు చెరిగాడు. అతడు అబద్ధాలకోరు అంటూ విమర్శించాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లా క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్.. మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. అతడు పచ్చి అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్‌లో పర్యటించక పోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమని తొలుత చెప్పిన నజ్రుల్..తర్వాత మాట మార్చాడు. ఇది ఆటగాళ్లు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నాడు. ఇక నజ్రుల్ యూ టర్న్ పై బంగ్లా అసిస్టెంట్ కోచ్ సలావుద్దీన్ ఫైర్ అయ్యారు.
'నేను స్వయంగా ఒక ఉపాధ్యాయుడిని. ఎంతో మంది విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దాను. సాధారణంగా గురువులు అబద్ధాలు ఆడరు. నజ్రులు కూడా ఉపాధ్యాయ వృతిలో ఉన్నాడు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులకు పాఠాలు బోధించాడు. అత్యున్నత విద్యా సంస్థ నుంచి వచ్చిన ఆయన ఇలాంటి అబద్ధాలు ఆడతాడని నేను అస్సలు ఊహించలేదు. ఆయన మాట్లాడిన తీరును మేము అస్సలు అంగీకరించము' అని సలావుద్దీన్(Mohammed Salahuddin) అన్నాడు.
'ప్రపంచకప్ 2026 టోర్నీ విషయంలో అతడు మొదట ఓ మాట చెప్పాడు. తర్వాత తనపై, ప్రభుత్వంపై నిందలు రాకుండా ఉండేందుకు.. మళ్లీ యూ టర్న్ తీసుకొని మాట మార్చాడు. ప్రతి ఒక యువ క్రికెటర్ ప్రపంచకప్‌లో పాల్గొనాలని కలలు కంటాడు. కానీ దాన్ని ఒక్క సెకనులో నజ్రుల్(Asif Nazrul) నాశనం చేశాడు. మీరు దేశానికి జరిగిన నష్టం గురించే మాట్లాడుతున్నారు. నేను ఆటగాళ్లకు జరిగిన నష్టం గురించి ప్రస్తావిస్తున్నాను. జట్టులోని కొందరు ఆటగాళ్లు అయితే కొన్ని రోజుల వరకు మానసికంగా తీవ్ర వేదనకు గురయ్యారు’ అని మహమ్మద్ సలావుద్దీన్ వెల్లడించాడు.
బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ (IPL 2026) నుంచి రిలీజ్ చేసిన అనంతరం భారత్, బంగ్లా మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భద్రత కారణాలను సాకుగా చూపుతూ బంగ్లాదేశ్ తమ క్రికెటర్లను భారత్‌కు పంపడానికి అంగీకరించలేదు. తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసీసీపై ఒత్తిడి తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లా ప్రతిపాదనను ఐసీసీ (ICC) తిరస్కరించింది. దీంతో బంగ్లా ప్రపంచకప్‌లో పాల్గొనలేదు. ఐసీసీ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బంగ్లా ఆటగాళ్లు పైకి ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తున్నామని చెబుతున్నా.. లోలోపల మాత్రం ఎంతో బాధపడుతున్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. వారి వేదననే బంగ్లా అసిస్టెంట్ కోచ్ సలావుద్దీన్ పరోక్షంగా బయటపెట్టారని క్రీడా నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
సూపర్ 8 వేళ పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. మ్యాచ్ ఆడకుండానే..!