Share News

ఇక సూపర్‌ ఫైట్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:07 AM

సంచలన ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 20 జట్లతో ఆరంభమైన ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం...

ఇక సూపర్‌ ఫైట్‌

  • నేటి నుంచి సెమీస్‌ బెర్త్‌లకు పోటీ

కొలంబో: సంచలన ఫలితాలతో ఆసక్తికరంగా సాగుతున్న టీ20 వరల్డ్‌కప్‌ ఇప్పుడు కీలక దశకు చేరుకుంది. 20 జట్లతో ఆరంభమైన ఈ మెగా టోర్నీలో ప్రస్తుతం 8 జట్లు మిగిలాయి. వీటి మధ్య శనివారం నుంచి మార్చి 1 వరకు సూపర్‌-8 పోరు సాగనుంది. గ్రూప్‌ ‘ఎ’ నుంచి భారత్‌, పాకిస్థాన్‌.. గ్రూప్‌ ‘బి’ నుంచి జింబాబ్వే, శ్రీలంక.. గ్రూప్‌ ‘సి’ నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌ ‘డి’ నుంచి దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ ఈ దశకు చేరుకున్నాయి. ఇక సెమీఫైనల్స్‌లో చోటే లక్ష్యంగా ఈ జట్లన్నీ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మాజీ విజేత ఆస్ట్రేలియాతో పాటు అఫ్ఘానిస్థాన్‌ గ్రూప్‌ దశ నుంచే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్‌-1లో భారత్‌, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌.. గ్రూప్‌-2లో న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ ఉన్నాయి. ఇందులో ప్రతీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. రెండింట్లో నుంచి టాప్‌-2గా నిలిచిన జట్లు సెమీస్‌కు వెళతాయి. పాయింట్లు సమంగా ఉంటే నెట్‌ రన్‌రేట్‌ కూడా కీలకమవుతుంది కాబట్టి ప్రతీ మ్యాచ్‌ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

భారత్‌కు సవాల్‌

వాస్తవానికి గ్రూప్‌-1 పరిశీలిస్తే భారత్‌కు పెద్దగా పోటీ లేదేమోననిపిస్తుంటుంది. కానీ ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా సూపర్‌-8కు వచ్చిన జట్లన్నీ ఇదే గ్రూప్‌లో ఉన్నాయనే విషయం మరువరాదు. అంచనాలకు మించిన ఆటతీరుతో ఈసారి వెస్టిండీస్‌, జింబాబ్వే చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆసీస్‌, శ్రీలంకలను జింబాబ్వే మట్టికరిపించింది. ఎలాంటి తడబాటు లేకుండా దూకుడుగా సాగుతున్న ఈ జట్లను తక్కువ అంచనా వేస్తే కష్టమే. ముందుగా భారత జట్టు ఆదివారం సఫారీలతో ఆడనుంది. దీంతో 2024 టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ రిపీట్‌ కానుంది. మరోవైపు గ్రూప్‌-2లో అన్నీ పటిష్ట జట్లే కావడంతో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగడం ఖాయం. ముఖ్యంగా పాక్‌పై తీవ్ర ఒత్తిడే నెలకొంది. అన్నీ సవ్యంగా కుదిరితే మరోసారి దాయాది జట్ల మధ్య సమరానికి కూడా ఆస్కారం లేకపోలేదు.

Updated Date - Feb 21 , 2026 | 02:07 AM