పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్...
ABN , Publish Date - Feb 20 , 2026 | 06:39 PM
ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్-ఏ జట్టు ఫైనల్‌కు చేరింది. పాకిస్థాన్-ఏతో ఇవాళ (ఫిబ్రవరి 20) జరిగిన రెండో సెమీఫైనల్లో 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (ACC Women’s Asia Cup Rising Stars 2026)లో బంగ్లాదేశ్-ఏ జట్టు పాకిస్థాన్- ఏ జట్టును చిత్తుగా ఓడించింది. ఇవాళ(శుక్రవారం)బ్యాంకాక్ వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య సెమీ ఫైనల్-2 జరిగింది. ఈ మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ ఫైనల్‌కు చేరింది. తుదిపోరులో భారత-ఏ జట్టుతో బంగ్లా జట్టు తలపడనుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన పాకిస్థాన్(Pakistan) బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. కెప్టెన్ ఫాహీమా(40) అద్భుతంగా రాణించారు. అలానే ఇష్మా తంజిమ్12, షమీమా సుల్తానా 13, సర్మిన్ సుల్తానా 15 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ హఫ్సా ఖలీద్ 2 వికెట్లు పడగొట్టింది. వహీదా అక్తర్, మొమినా రియాసత్, అనోషా నాసిర్, ఒమైమా సొహైల్ తలో వికెట్ సాధించారు.
అనంతరం 111 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్.. బంగ్లా బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. సంజిద 3, ఫాహీమా 2 వికెట్లు తీసి బంగ్లా గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఫాతిమా, ఫరీహా, ఫర్జానా తలో వికెట్ సాధించారు. పాక్ ఇన్నింగ్స్‌లో షావాల్ జుల్ఫిఖర్ (14), యుస్రా ఆమిర్ (11), హఫ్సా ఖలీద్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మరోవైపు ఇవాళే జరిగిన తొలి సెమీఫైనల్లో భారత-ఏ జట్టు శ్రీలంక-ఏపై 5 వికెట్ల తేడాతో గెలుపొంది. దీంతో భారత్-ఏ(India-A), బంగ్లాదేశ్-ఏ జట్లు ఫిబ్రవరి 22న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.
ఇవి కూడా చదవండి:
భారత్ సెమీస్‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్