Share News

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:04 PM

టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీస్‌ ఫైనల్‌కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్  సంచలన వ్యాఖ్యలు
Mohammad Amir

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్-2026లో భాగంగా మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రేపటి(ఫిబ్రవరి 21)నుంచి సూపర్-8 మ్యాచులు జరగనున్నాయి. టైటిల్ గెలవడమే లక్ష్యంగా ఎనిమిది జట్లు తీవ్రంగా శ్రమిస్తోన్నాయి. ఇది ఇలా ఉంటే.. టీమిండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ ఆమిర్ సంచలన కామెంట్స్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌-2026లో భారత్ సెమీస్‌ ఫైనల్‌కు చేరే అవకాశం లేదంటూ తన అక్కసు వెళ్లగక్కాడు.


పాక్‌ చెందిన ఓ న్యూస్ ఛానల్ డిబెట్లో మహమ్మద్‌ ఆమిర్‌ మాట్లాడుతూ..‘పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తప్ప లీగ్‌ దశలో ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ కుప్పకూలింది. కాబట్టి ఆ జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలు లేవు. మరోవైపు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు అద్భుతంగా ఆడుతున్నాయి. ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఆ జట్లకు ఉంది. కాబట్టి ఈ రెండు జట్లే సెమీస్‌ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని పేర్కొన్నాడు.


ఇంతలో, ఇతర ప్యానెలిస్టులు టీమిండియా కచ్చితంగా సెమీస్‌కు వెళ్తుందని సూచించారు. సెమీస్‌లో పాకిస్థాన్, భారత్ మ్యాచ్‌ను చూస్తానని సీనియర్ క్రికెటర్ రషీద్ లతీఫ్ తెలిపాడు. టీమిండియా, దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌కు చేరుకుంటాయని అహ్మద్ షెహజాద్ కూడా అన్నాడు. ఇక ఆమిర్ విషయానికి వస్తే.. ఇతడు 2009లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. జాతీయ క్రికెట్ కు రిటైర్‌మెంట్ ప్రకటించిన ఆమిర్.. ప్రస్తుతం లీగ్ ఆడుతున్నాడు. తరచూ మీడియా ముందుకు వస్తూ.. భారత్ పై తన అక్కసు వ్యక్తం చేస్తుంటాడు.


ఆమిర్‌ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌ తిరుగులేని జట్టని, కించపరిచాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ముందు తన జట్టు (పాక్‌) సంగతి చూసుకోవాలని, గత ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఓడి లీగ్‌ దశలోనే ఇంటిబాట పట్టిన విషయం మర్చిపోవద్దంటూ మరికొందరు ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు. ఇటీవలే టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై కూడా ఆమిర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ క్రికెటర్ గుడ్‌ బై

మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్

Updated Date - Feb 20 , 2026 | 03:15 PM