బ్యాటింగ్ ఆర్డర్‌ను గంభీర్ నాశనం చేస్తున్నాడు: కృష్ణమాచారి శ్రీకాంత్
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:09 AM
ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెచ్‌కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్.. గంభీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో రోహిత్ శర్మ అద్భుత శతకం, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలు సాధించినప్పటికీ భారత్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయాలపై బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. మూడో వన్డేలో కె.ఎల్. రాహుల్‌ను ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా శ్రీకాంత్ మాట్లాడుతూ..' పెద్ద లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు కె.ఎల్. రాహుల్‌ను ఆరో స్థానంలో ఎలా పంపుతారు?. గతంలో ఎన్నో కష్టసాధ్యమైన ఛేజింగ్‌లలో జట్టును గెలిపించిన ఆటగాడితో ఇలా ప్రయోగాలు చేయడం ఏంటి?. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీలా కెరీర్‌లతో ఆడుకున్నట్లే, ఇప్పుడు రాహుల్‌ను కూడా పక్కనబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అన్యాయమే. మ్యాచ్‌లో అతని హావభావాలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాయి' అని శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
'మ్యాచ్ చివర్లో 36 బంతుల్లో 84 పరుగులు కావాల్సిన సమయంలో రాహుల్ 8 బంతుల్లో 12 పరుగులు చేయగలిగాడు. ఇంగ్లండ్‌కు జోస్ బట్లర్ చేసిన పాత్రలాంటిది భారత్‌కు అవసరమైనప్పుడు రాహుల్‌ను నాల్గో స్థానంలో పంపి ఉంటే బాగుండేది. 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీతో కలిసి రాహుల్ అందించిన భాగస్వామ్యాలు జట్టును గెలిపించాయి. కానీ, మ్యాచ్ చేజారిపోయాక ఓవర్‌కు 15 పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో అక్షర్ పటేల్‌తో కలిసి ఆడమని పంపితే రాహుల్ మాత్రం ఏం చేస్తాడు?' అని శ్రీకాంత్ ఘాటుగా ప్రశ్నించాడు.
ఇవి కూడా చదవండి:
‘ఆటను ఆస్వాదించు’.. కోహ్లీ సలహాతో సింధు పునరాగమనం
రోహిత్, కోహ్లీలను జట్టు నుంచి తొలగించలేరు: అశ్విన్