Share News

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి

ABN , Publish Date - Aug 07 , 2026 | 08:36 PM

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈనేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్ రాజు కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రాను టెస్టు ఫార్మట్‌లోనే ఆడిస్తే మేలు.. మాజీ క్రికెటర్ కులకర్ణి
Jasprit Bumrah injury

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను గాయాలు వేధిస్తున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా మోకాళ్లకు తగిలిన గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో ఆగస్టు15 నుంచి ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. వన్డే ప్రపంచకప్‌2027నకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండటంతో బూమ్రా తరచూ గాయపడుతుండటంతో బీసీసీఐ, జట్టు యాజమాన్యానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


బుమ్రా వరుస గాయాల నేపథ్యంలో అతడిని ఇకపై ఏదో ఒక ఫార్మాట్‌కే పరిమితం చేయడం మేలని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ రాజు కులకర్ణి సూచించాడు. 'బుమ్రా మూడు ఫార్మాట్లలోనూ నిరంతరం ఆడటం కష్టం. టెస్టు క్రికెట్ అత్యంత కీలకమైంది కాబట్టి, అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేయడం గురించి బీసీసీఐ, జట్టు యాజమాన్యం ఆలోచించాలి. ఐపీఎల్, టీ20, వన్డేలు ఆడాలని అతడికి ఉన్నప్పటికీ అది సాధ్యం కాకపోవచ్చు' అని కులకర్ణి పేర్కొన్నాడు.


అలాగే, బుమ్రా భిన్నమైన బౌలింగ్ శైలే అతడు పదే పదే గాయపడటానికి ప్రధాన కారణమని కులకర్ణి అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా పరిపూర్ణమైన బౌలింగ్ యాక్షన్ ఉన్నందుకే రిచర్డ్ హాడ్లీ, కపిల్ దేవ్‌లు సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించగలిగారని.. కానీ బుమ్రా టెక్నిక్ గా బౌలింగ్ వేయడంలో పటిష్టంగా లేడని, అందుకే అతడి శరీరంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని వివరించాడు. ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యల నేపథ్యంలో బుమ్రా వర్క్‌లోడ్‌పై టీమిండియా యాజమాన్యం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయాపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్ట్ సిరీస్.. శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం

వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించకుండా ఉండాల్సింది: మాజీ క్రికెటర్ ప్రియాంక్

Updated Date - Aug 07 , 2026 | 09:31 PM