Share News

హాకీ ప్రపంచ కప్: 28 ఏళ్ల తర్వాత.. టోర్నీలో భారత అంపైర్‌కు నో ఛాన్స్

ABN , Publish Date - Aug 07 , 2026 | 01:39 PM

హాకీ ప్రపంచ కప్‌లో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత అంపైర్ల ప్రాతినిధ్యానికి ఈసారి బ్రేక్ పడింది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో ప్రారంభం కానున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో ఒక్క భారత అంపైర్ లేదా టెక్నికల్ అధికారి కూడా చోటు దక్కించుకోలేదు.

హాకీ ప్రపంచ కప్: 28 ఏళ్ల తర్వాత.. టోర్నీలో భారత అంపైర్‌కు నో ఛాన్స్
Hockey World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: హాకీ ప్రపంచ కప్‌లో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత అంపైర్ల ప్రాతినిధ్యానికి ఈసారి బ్రేక్ పడింది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్, బెల్జియంలో ప్రారంభం కానున్న ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో ఒక్క భారత అంపైర్ లేదా టెక్నికల్ అధికారి కూడా చోటు దక్కించుకోలేదు. 1998లో యూట్రెక్ట్‌లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత తొలిసారి ఈ పరిస్థితి నెలకొంది. యూరప్ దేశాలకు చెందిన అధికారులు ప్యానెల్‌లో ఎక్కువగా ఉన్నారు.


ఆధునిక కాలంలో పురుషుల ప్రపంచ కప్‌లకు భారత్ నుంచి ఇప్పటివరకు నలుగురు మాత్రమే అంపైర్లుగా వ్యవహరించారు. అమర్‌జిత్ సింగ్ బావా (1990), తార్లోక్ సింగ్ భుల్లర్ (1994), సతీందర్ శర్మ (2002, 2006, 2010), ఆర్.వీ. రఘు ప్రసాద్ (2010, 2014, 2018, 2023) ఈ ఘనత సాధించారు. గతేడాది అంతర్జాతీయ అంపైరింగ్‌కు వీడ్కోలు పలికిన రఘు ప్రసాద్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రతిష్ఠాత్మక టోర్నీలకు అధికారుల ఎంపిక నిరంతర ప్రదర్శనల ఆధారంగానే జరుగుతుందని తెలిపారు. ప్రపంచ కప్, ఒలింపిక్స్, ప్రో లీగ్ వంటి టోర్నీల్లో అంపైర్ల ప్రదర్శనలను ఎఫ్‌ఐహెచ్ అంపైరింగ్ కమిటీ పరిశీలిస్తుందని.. కొంతకాలం పాటు నిలకడగా రాణించడం అవసరమని చెప్పారు.


వారితో పోటీ అంత సులువు కాదు..

భారత్‌కు చెందిన మరో మాజీ అంపైర్ సతీందర్ శర్మ ప్రపంచ కప్ ప్యానెల్‌లో భారత్ ప్రాతినిధ్యం లేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. అమర్‌జిత్ సింగ్ బావా, తార్లోక్ సింగ్ భుల్లర్ తర్వాత తాను, రఘు ప్రసాద్ భారత అంపైరింగ్ వారసత్వాన్ని కొనసాగించామని చెప్పారు. ‘యూరప్‌కు చెందిన అంపైర్ల మధ్య మనల్ని మనం నిరూపించుకోవడం అంత సులువు కాదు. ప్రస్తుతం భారత్ వెనుకబడుతోంది. దేశీయ అంపైర్లకు అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలి. దేశీయ, అంతర్జాతీయ అంపైరింగ్‌లో చాలా తేడా ఉంటుంది. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అనుభవం లేకుండా అంపైర్లు ఎలా ఎదుగుతారు? జాతీయ జట్టు శిక్షణ శిబిరాల్లో అంపైర్లకు కూడా అవకాశం కల్పించాలి. ఆధునిక హాకీ డిమాండ్లను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతిభ ఉన్నప్పటికీ అంపైర్లకు సరైన అవకాశాలు, ఫెడరేషన్ మద్దతు అవసరం. వచ్చే ప్రపంచ కప్ లేదా ఒలింపిక్స్‌లో భారత్ ప్రాతినిధ్యం ఉండాలంటే పక్కా ప్రణాళిక, క్రమబద్ధమైన వ్యవస్థ అవసరం’ అని సతీందర్ శర్మ పేర్కొన్నారు.


ఆర్థిక భద్రత కూడా పెద్ద సమస్యే..!

హాకీ ఇండియా 2025లో వెల్లడించిన వివరాల ప్రకారం.. పురుషుల అంపైరింగ్ వ్యవస్థలో కోర్ లీడింగ్ ప్యానెల్, లీడింగ్ ప్యానెల్, హై పొటెన్షియల్, నేషనల్ అంపైర్స్ అంటూ నాలుగు విభాగాలు ఉన్నాయి. ఇందులో 100 మందికి పైగా అధికారులు ఉన్నప్పటికీ.. ఎఫ్‌ఐహెచ్ ప్యానెల్‌లో భారత పురుష అంపైర్లు ఆరుగురు, మహిళలు నలుగురు మాత్రమే ఉన్నారు. అంతేకాదు, భారత్‌లో పురుషుల టెక్నికల్ అధికారులు నలుగురు, మహిళలు ఇద్దరే ఉన్నారు. అంపైర్లకు సరైన ఆర్థిక భద్రత లేకపోవడం కూడా ఈ వృత్తి వైపు యువత రావడానికి అడ్డంకిగా మారుతోందని మాజీ అధికారులు చెబుతున్నారు. తమ రోజుల్లో దేశీయ టోర్నీల్లో రోజుకు రూ.150-200, అంతర్జాతీయ పోటీల్లో 40-50 అమెరికన్ డాలర్ల వరకు భత్యం లభించేదని మాజీ అంపైర్ సతీందర్ శర్మ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

అరంగేట్రం తర్వాత రెండేళ్లు అవకాశం కోసం ఎదురుచూశా: అజింక్య రహానె

శ్రీలంకతో కీలక సిరీస్: శుభ్‌మన్ గిల్‌ గాయంపై స్పందించిన బీసీసీఐ

Updated Date - Aug 07 , 2026 | 01:39 PM