కోహ్లీ, ధోనీ, రోహిత్‌లను తన పెళ్లికి పిలవని టీమిండియా క్రికెటర్
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:15 PM
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు అక్షితా రాజ్‌ను వివాహం చేసుకున్నాడు. అయితే ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మలను పిలవలేదు. ఎందుకంటే....
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. తన స్నేహితురాలు అక్షితా రాజ్‌ను అతడు వివాహమాడాడు. ఆధ్యాత్మిక నగరం వారణాసి (బనారస్) వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. బుధవారం ఆకాశ్ దీప్ తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక అతిథి సరదాగా.. 'భయ్యా.. నీ పెళ్లికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఎం.ఎస్ ధోనీలను ఆహ్వానించలేదేంటి?' అని ప్రశ్నించాడు. దానికి ఆకాశ్ దీప్ తెలివైన సమాధానం ఇస్తూ నవ్వులు పూయించాడు. 'ఒకవేళ వారే కనుక ఇక్కడికి వస్తే.. ఇక ఈ బనారస్‌లో నా పెళ్లి సజావుగా సాగుతుందా చెప్పండి?' అని బదులిచ్చాడు.
ఈ టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు వస్తే అభిమానుల తాకిడి ఏ రేంజ్‌లో ఉంటుందో, ఆ అభిమానులను తట్టుకుని పెళ్లి జరిపించడం ఎంత కష్టమో ఆకాశ్ దీప్ ఇచ్చిన కౌంటర్ అందరినీ ఆకట్టుకుంది. ఆకాశ్ క్రికెట్ విషయానికి వస్తే.. గతేడాది ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'ఆండర్సన్-టెండూల్కర్' సిరీస్‌లో ఒకే మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు ఆకాశ్ దీప్‌ను సొంతం చేసుకున్నప్పటికీ, వెన్నునొప్పి కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ప్రస్తుతం ఈ గాయం కారణంగానే అతడు భారత టెస్టు జట్టుకు కూడా ఎంపిక కాలేదు. క్రికెట్ నుంచి దొరికిన ఈ విరామంలో ఆకాశ్ దీప్ తన వివాహ బంధాన్ని ముగించుకుని కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. క్రీడా ప్రముఖులు, అభిమానులు ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!
పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్