కన్నీళ్లు పెట్టుకున్న బ్రెజిల్ స్టార్ నెయ్‌మార్!
ABN , Publish Date - Jun 25 , 2026 | 11:34 AM
ఫుట్‌బాల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ నెయ్‌మార్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టు జెర్సీని ధరించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఫుట్‌బాల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్, మాజీ కెప్టెన్ నెయ్‌మార్ దాదాపు మూడేళ్ల (981 రోజులు) సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి జాతీయ జట్టు జెర్సీని ధరించాడు. ఫిఫా ప్రపంచకప్ 2026 గ్రూప్-సి లో భాగంగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెయ్‌మార్ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 3-0 తేడాతో బ్రెజిల్ ఘనవిజయం సాధించగా.. జట్టు విజయం కంటే నెయ్‌మార్ పునరాగమనమే అభిమానుల్లో ఎక్కువ ఉత్సాహాన్ని నింపింది.
2023 అక్టోబర్‌లో ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో నెయ్‌మార్ మోకాలికి తీవ్ర గాయమైంది. ఆ తర్వాత సర్జరీ జరగడంతో సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్నాడు. 34 ఏళ్ల వయసులో ఈ తరహా గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేయడం అంత సులువు కాదు. కానీ, పట్టుదలతో శ్రమించిన నెయ్‌మార్.. మియామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 76వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి ప్రవేశించాడు. అతడు వార్మప్ చేస్తున్న సమయం నుంచే స్టేడియంలోని అభిమానులు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు.
ఇక మ్యాచ్ అనంతరం నెయ్‍మార్ మాట్లాడుతూ... 'మూడేళ్ల తర్వాత మళ్లీ జాతీయ జెర్సీని ధరించడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇస్తోంది. శారీరకంగా నేను బాగున్నాను. ఇన్నాళ్లూ ఆటకు దూరం కావడం మానసికంగా నన్ను కలచివేసింది' అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి వ్యూహం ప్రకారమే నెయ్‌మార్ రెండో అర్ధభాగంలో బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ వినిసియస్ జూనియర్ రెండు అద్భుత గోల్స్‌తో మెరిశాడు. 'మా ఆరాధ్య ఆటగాడు జట్టులోకి రావడం మాకందరికీ కొండంత బలాన్నిచ్చింది. అతడు మరింత రాణించి ఈ టోర్నీలో మాకు అండగా నిలుస్తాడని ఆశిస్తున్నాను' అని వినిసియస్ పేర్కొన్నాడు. నెయ్‌మార్ రాకతో బ్రెజిల్ శిబిరంలో సరికొత్త జోష్ నెలకొంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లిపీటలెక్కిన టీమిండియా క్రికెటర్