టీ20 వరల్డ్ కప్-2026 నుంచి బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన శ్రీలంక
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:00 AM
టీ20 ప్రపంచకప్-2026 నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మౌనంగా ఉన్న శ్రీలంక తాజాగా స్పందించింది. ఆ దేశ క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే బంగ్లా అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2026) నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌లో ఆడే తమ మ్యాచులను శ్రీలంకకు తరలించాలని మొండి పట్టుపట్టిన బంగ్లా భారీ మూల్యం చెల్లించుకుంది. భద్రత విషయంలో ఐసీసీ ఎంత చెప్పినా వినకపోవడంతో బంగ్లాపై వేటు అనివార్యమైంది. ఈ ఐసీసీ మెగా టోర్నీ విషయంలో బంగ్లా స్థానంలో.. నిబంధనల ప్రకారం స్కాట్లాండ్‌కు అవకాశం కల్పించింది ఐసీసీ. దీనిపై పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌కు అనుకూలంగా మాట్లాడింది. మరోవైపు బంగ్లాదేశ్(Bangladesh) వివాదంపై ఈ మెగా టోర్నీకి భారత్‌తో పాటు ఆతిథ్యమిస్తున్న శ్రీలంక.. ఇన్నాళ్లుగా మౌనం వహిస్తూ ఇప్పుడా నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసింది.
శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి బందులా దిస్సనాయకే మీడియా వేదికగా మాట్లాడుతూ.. 'ఇండియా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వివాదాల విషయంలో మాది తటస్థ వైఖరి. భారత్, బంగ్లా, పాక్.. ఈ మూడూ మాకు స్నేహపూర్వక దేశాలు. మా దేశంలో రానున్న రోజుల్లోనూ ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి టోర్నీలు నిర్వహించేందుకు ఏ దేశం అడిగినా మేము సానుకూలంగా స్పందిస్తాం’ అని పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు తమకు శ్రీలంక మద్దతుగా నిలుస్తుందని భావించిన బీసీబీకి.. శ్రీలంక తటస్థ వైఖరి అవలంబించడంతో షాక్ తగిలినట్టైంది.
మరోవైపు శ్రీలంక క్రీడా శాఖ మంత్రి సునిల్ కుమార గమేజ్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మ్యాచ్ సాఫీగా సాగేందుకు తాము కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ మ్యాచ్ తమకు ప్రథమ ప్రాధాన్యం అని.. ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇన్నాళ్లూ బంగ్లాదేశ్‌కు మద్దతుగా తామూ టోర్నీని బహిష్కరిస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఓవరాక్షన్ చేసిన పాకిస్థాన్( Pakistan).. ఇక లంకకు పయనమయ్యేందుకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు సమాచారం. దీంతో పాక్.. పైకి బంగ్లాకు మద్దుతుగా ఉన్నట్లు నటిస్తూనే.. వెనక నుంచి వెన్నుపోటు పొడించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!
నా రిటైర్మెంట్‌కు కారణం అదే.. యువీ షాకింగ్ కామెంట్స్..