Share News

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - Jan 29 , 2026 | 05:36 PM

ప్రపంచ కప్-2026 విషయంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో పర్యటించమని స్పష్టం చేసిన బంగ్లాదేశ్.. తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియా రైఫిల్‌ అండ్ పిస్టల్‌ ఛాంపియన్‌షిప్‌-2026 కోసం తమ బృందాన్ని భారత్‌కు పంపేందుకు బంగ్లా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది..

బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం.. భారత్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్..
Bangladesh shooting team

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌-2026 నేపథ్యంలో బంగ్లాదేశ్ (Bangladesh) చేసిన రచ్చ గురించి అందరికీ తెలిసిందే. భారత్‌లో తాము ఆడమంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించడం, ఆ తర్వాత ఐసీసీ కూడా ఆ దేశ జట్టుకు షాక్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్‌ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే ఇది బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు కాదు.. షూటింగ్‌ జట్టు. ఆసియా రైఫిల్‌ అండ్ పిస్టల్‌ ఛాంపియన్‌షిప్‌-2026 కోసం బంగ్లాదేశ్ బృందం భారత పర్యటనకు రానుంది. ఈ మేరకు బంగ్లా ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.


ఈ టోర్నీ ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఢిల్లీలోని డాక్టర్‌ కర్ణి సింగ్‌ షూటింగ్‌ రేంజ్‌లో జరగనుంది. ఈ పోటీలో 17 దేశాల నుండి 300 మందికి పైగా షూటర్లు పాల్గొంటారు. బంగ్లాదేశ్ తరపున ఇద్దరు రైఫిల్ షూటర్లు (Bangladesh shooting team) మొత్తం మూడు ఈవెంట్లలో పోటీపడతారు. ప్రపంచ టీ20 క్రికెట్ టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన తర్వాత, 'భద్రతా కారణాల' దృష్ట్యా ఆ దేశ షూటింగ్ జట్టు కూడా వైదొలగవచ్చని ఊహాగానాలు వెలువడ్డాయి.


బంగ్లాదేశ్ క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొననున్నారని నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) బుధవారం ఓ జాతీయ మీడియాకు తెలిపింది. టీ20 ప్రపంచ కప్-2026 క్రికెట్‌ మ్యాచ్‌లు భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌.. షూటింగ్‌ పోటీల్లో( Asian Rifle Pistol Championship ) ఎలా పాల్గొననుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. క్రికెట్‌ మ్యాచ్‌లకు లభించని భద్రత షూటింగ్‌కు లభిస్తుందా అని భారత క్రీడాభిమానులు సెటైర్లు వేస్తున్నారు. అలాగే ఈ విషయంపై భారత షూటింగ్‌ సమాఖ్య ఎలా స్పందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

ప్రపంచ కప్ -2026 నుంచి తప్పుకుంటే.. పాక్‌కు భారీ నష్టం!

నా రిటైర్మెంట్‌‌కు కారణం అదే.. యువీ షాకింగ్‌ కామెంట్స్‌..

Updated Date - Jan 29 , 2026 | 05:51 PM