Share News

సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు..

ABN , Publish Date - Feb 20 , 2026 | 03:58 PM

టీ20 వరల్డ్ కప్-2026 సూపర్-8 ఫార్మాట్‌పై ప్రస్తుతం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఐసీసీ ప్రవేశపెట్టిన ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో గ్రూప్ స్టే‌జ్‌లో టాపర్లుగా ఉన్న జట్లకు అన్యాయం జరుగుతోందని క్రీడా అభిమానులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.

సూపర్-8 ఫార్మాట్ విషయంలో ఐసీసీపై విమర్శలు..
ICC Super 8 controversy

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (World Cup 2026) సూపర్-8 ఫార్మాట్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రీ-సీడింగ్ విధానం వల్ల టోర్నీలో అసమతుల్యత ఏర్పడిందని క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రీ-సీడింగ్ విధానం విషయంలో ఐసీసీపై క్రీడా వర్గాలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...


సాధారణంగా ఏదైనా టోర్నీలో గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత, పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన జట్లకు తదుపరి రౌండ్లో కాస్త ఉపశమనం ఇచ్చేలా సీడింగ్ విధానం ఉంటుంది. అయితే ఈసారి ఐసీసీ టీ20 ప్రపంచ కప్-2026 టోర్నీ ప్రారంభం కాకముందే.. ఏ టీమ్ ఏ గ్రూపులో ఉండాలో ఫిక్స్ చేసేసింది. టోర్నీ ప్రారంభం కాకముందే సీడింగ్ వేయడంతో దీన్ని ప్రీ-సీడింగ్(pre-seeding) అంటారు. దీని అర్థం ఏంటంటే.. ఒక టీమ్ తన గ్రూపులో మొదటి స్థానంలో నిలిచినా, రెండో స్థానంలో నిలిచినా... ముందుగా అనుకున్న స్లాట్‌లోనే ఉంటుంది.


ఈ ముందస్తు నిర్ణయం వల్ల తాజాగా ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ స్టేజ్‌లో టాపర్లుగా నిలిచిన భారత్(Team India), వెస్టిండీస్, సౌతాఫ్రికా, జింబాబ్వే జట్లు.. సూపర్ 8లో ఒకే గ్రూపులో ఉన్నాయి. మరోవైపు రెండో స్థానంలో నిలిచిన పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్(England) జట్లు మరో గ్రూపులో( గ్రూప్-2) ఉన్నాయి. ఇదే ప్రస్తుతం క్రికెట్ అభిమానులతో పాటు, క్రీడా నిపుణుల నుంచి ఐసీసీకి విమర్శలు ఎదుర్కొనేలా చేస్తోంది.


ఈ విధానం కారణంగా గ్రూప్ స్టేజ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన నాలుగు జట్లలో రెండు జట్లు ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అదే సమయంలో గ్రూప్ స్టేజ్‌లో రెండో స్థానంలో నిలిచిన రెండు జట్లకు సెమీస్‌కు చేరడం సులభమవుతోంది. ఇది టాపర్లుగా నిలిచిన జట్లకు అన్యాయం చేసినట్లే అని, ప్రతిభను గౌరవించేలా లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


ఐసీసీ స్పందన ఇదే..

సూపర్-8 ఫార్మాట్ విధానంపై వస్తున్న విమర్శలపై ఐసీసీ(ICC) స్పందించింది. ఈ టోర్నీని భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నందున రవాణా, భద్రత, బ్రాడ్‌కాస్టింగ్ షెడ్యూల్‌‌కు సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం కోసమే ఇలా చేశామని చెబుతోంది. వేల సంఖ్యలో ప్రయాణించే అభిమానులు, మీడియాకు ఇబ్బంది కలగకుండా ఏ జట్టు ఎక్కడ ఆడుతుందో ముందే తెలిస్తే సౌకర్యంగా ఉంటుందని ఐసీసీ సమర్థించుకుంటోంది.


ఇవి కూడా చదవండి:

భారత్ సెమీస్‌‌కు చేరదు.. పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు

మాతో మ్యాచ్‌ను భారత్ సీరియస్‌గా తీసుకోవట్లేదు: పాక్ మాజీ పేసర్

Updated Date - Feb 20 , 2026 | 04:26 PM