ఏఐ ఇంపాక్ట్ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల వీరంగం.. సిగ్గుచేటని బీజేపీ ఆగ్రహం
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:56 PM
ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో శుక్రవారంనాడు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (India AI Impact Summit)లో శుక్రవారంనాడు అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పలువురు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి వీరంగం చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐ సమ్మిట్ జరుగుతున్న ఒక హాలులో ఈ ఘటన చోటుచేసుకుందని, కొందరు గుంపుగా వేదిక వద్దకు చేరి చొక్కాలు విప్పి గాలిలో ఊపుతూ నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పలువురిని నిర్బంధంలోకి తీసుకున్నామని, భారత్ మండపంలోకి ఈ గ్రూప్ ఎలా ప్రవేశించిందనే దానిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు పాస్‌తో లోపలకు ప్రవేశించారా, క్యూఆర్ కోడ్‌తో లోపలకు వచ్చారా అనేది ఆరా తీస్తున్నారు. ఏఐ సదస్సులో యువజన కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సిగ్గుచేటు: బీజేపీ
ఈ ఘటనను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ఖండించారు. కాంగ్రెస్ చర్య దేశానికి సిగ్గుచేటని, చేసిన పనికి కాంగ్రెస్ సిగ్గుపడాలని అన్నారు. 'ఇది నేషనల్ షేమ్. టెక్నాలజీలో నాయకత్వం, ఇన్నొవేషన్‌కు పెద్దపీట వేస్తూ ప్రతిష్టాత్మక గ్లోబల్ ఏఐ సమ్మిట్‌కు భారత్ అతిథ్యం ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్టపాలు చేయాలనుకుంటోంది' అని అమిత్ మాలవీయ తప్పుపట్టారు. గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా నిలిచేందుకు భారత్ కృషి చేస్తుంటే ఇలాంటి దుశ్చర్యలు దేశప్రయోజనాలకు భంగకరమని అన్నారు. రాజకీయంగా విభేదించడం ప్రజాస్వామిక హక్కు అని, అయితే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దెబ్బతీయడం తగదని అన్నారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా ఆధ్వర్యంలోని కీలక కూటమిలో భారత్ చేరిక
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్