Share News

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్.. వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!

ABN , Publish Date - Jun 18 , 2026 | 11:10 AM

ఇటీవల దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక- ఎ జట్టు ఆటగాళ్లు చేసిన స్లెడ్జింగ్‌కు స్పందించి వైభవ్ సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. అయితే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు సూచిస్తున్నారు.

సూర్యవంశీకి 'స్లెడ్జింగ్' సవాల్..  వాటిని ఎదుర్కొనే కళను నేర్చుకోవాలి!
Vaibhav Suryavanshi

స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం క్రీడా ప్రపంచం దృష్టి పడింది. ఇటీవలి ఐపీఎల్‌ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఏకంగా 776 పరుగులు సాధించి 'ఆరెంజ్ క్యాప్' గెలవడంతో అతడి క్రేజ్ అమాంతం పెరిగింది. అయితే, ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యమని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఇటీవల దంబుల్లా వేదికగా శ్రీలంక-ఎ తో జరిగిన భారత్- ఎ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్లు చేసిన 'స్లెడ్జింగ్'కు సూర్యవంశీ తీవ్రంగా స్పందించి అసహనానికి గురయ్యాడు. అంతేకాక శ్రీలంక ప్లేయర్ ఛాతిపై చేయి వేసి.. నెట్టేశాడు. దీంతో ఈఘటనపై స్పందించిన బీసీసీఐ వైభవ్‌కు జరిమానా విధించింది. శ్రీలంక ఆటగాళ్లతో గొడవపై ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సవనూర్ స్పందిస్తూ.. వైభవ్ కెరీర్ వృద్ధి చెందుతున్న కొద్దీ ప్రత్యర్థులు అతడిని మానసికంగా దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్‌ను ఒక ఆయుధంగా వాడుకుంటారని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను తట్టుకోవడానికి యువ ఆటగాళ్లకు పరిస్థితులను ఎదుర్కునే శిక్షణ ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.


టీమిండియా మాజీ క్రికెటర్ వి.వి.ఎస్. లక్ష్మణ్ నేతృత్వంలో బృందం యువ ఆటగాళ్ల మానసిక స్థితిపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. అండర్-19 స్థాయిలో అద్భుతంగా రాణించిన ఎందరో ఆటగాళ్లు, సీనియర్ స్థాయికి వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక విఫలమవుతున్నారు. ఇందుకు టెక్నిక్ లోపం కాదు, మానసిక నియంత్రణ లేకపోవడమే కారణమని నిపుణులు చెప్తున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాల రిటైర్మెంట్ తర్వాత జట్టులో చోటు కోసం యువ ఆటగాళ్లు ఆత్రుత పడకుండా, బీసీసీఐ వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలని మాజీ సెలెక్టర్లు కూడా సూచిస్తున్నారు. మైదానంలో ఒత్తిడిని జయించి, మనసు, మైండ్‌పై నియంత్రణ సాధించినప్పుడే వైభవ్ సూర్యవంశీ వంటి అసాధారణ ప్రతిభావంతులు సుదీర్ఘ కాలం రాణించగలరని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

డబుల్ సెంచరీ మిస్ కావడంపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

Updated Date - Jun 18 , 2026 | 11:48 AM