Share News

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్

ABN , Publish Date - Jun 18 , 2026 | 09:32 AM

ఫిఫా ప్రపంచకప్‌ 2026 గ్రూప్‌-కేలో సంచలన ఫలితం నమోదైంది. స్టార్‌ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో సారథ్యంలోని పోర్చుగల్‌ జట్టును పసికూన డీఆర్‌ కాంగో 1-1 గోల్స్‌తో నిలువరించింది.

పోర్చుగల్‌కు కాంగో షాక్.. డ్రాగా ముగిసిన మ్యాచ్
Portugal vs DR Congo

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ 2026లో బలమైన పోర్చుగల్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. హ్యూస్టన్‌లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగిన గ్రూప్-కె మ్యాచ్‌లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో(డీఆర్ కాంగో) జట్టు 1–1తో పోర్చుగల్‌ను నిలువరించింది. మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, కాంగో పటిష్ఠ రక్షణ శ్రేణిని ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది.


మ్యాచ్ ప్రారంభమైన 6వ నిమిషంలోనే పోర్చుగల్ ఆటగాడు జోనో నెవ్స్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, డిఫెండర్ విభాగాన్ని పటిష్ఠం చేసుకున్న కాంగో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో 44వ నిమిషంలో కాంగో స్టార్ యోనే విస్సా హెడర్ ద్వారా బంతిని నెట్‌లోకి పంపి స్కోరును 1-1తో సమం చేశాడు. రెండో అర్ధ భాగంలో పోర్చుగల్ బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేయలేకపోయింది. ఈ మ్యాచ్ లో కాంగోపై గోల్‌తో పోర్చుగల్ యువ మిడ్‌ఫీల్డర్‌ జోవా నెవిస్‌ అరుదైన ఘనత సాధించాడు. ఫిఫా ప్రపంచకప్‌ చరిత్రలో గోల్‌ చేసిన మూడో అతి పిన్న వయస్కుడైన పోర్చుగీస్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అతడు 21 ఏళ్ల 263 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అతడి కంటే ముందు ఈ జాబితాలో దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(2006), రామోస్‌ (2022) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.


మరోవైపు పోర్చుగల్ స్టార్ స్ట్రైకర్ క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్‌లో పూర్తిగా నిరాశపరిచాడు. కాంగో డిఫెండర్లు అతడిని గట్టిగా మార్క్ చేయడంతో రొనాల్డోకు గోల్ చేసే అవకాశాలు దక్కలేదు. ఈ పేలవ ప్రదర్శనపై రొనాల్డో సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. 'మేము అనుకున్న ఆరంభం ఇది కాదు. కానీ ఇక్కడితో అంతా అయిపోలేదు. తల ఎత్తి తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెడతాం' అంటూ అభిమానుల్లో నమ్మకాన్ని నింపాడు. మరో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-ఎల్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో క్రొయేషియాపై 4-2తో విజయం సాధించింది. స్టార్‌ స్ట్రైకర్‌ హ్యారీ కేన్‌ రెండు గోల్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ 2026: పాకిస్థాన్‌ను ఓడించిన సౌతాఫ్రికా

మెస్సీ.. మెస్సీ.. మెస్సీ అంతా తానై..

Updated Date - Jun 18 , 2026 | 11:31 AM