Share News

చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. జట్టుకు కెప్టెన్ దూరం!

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:49 PM

ఐపీఎల్‌ 2026లో ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. జట్టుకు కెప్టెన్ దూరం!
Ruturaj Gaikwad

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్కే తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంకి చేరుకోవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది. అయితే జీటీతో మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు బిగ్ షాక్ తగిలింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ జట్టును వీడినట్లు సమాచారం. కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కార‌ణంగా ఆకస్మికంగా పుణేకు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి మ్యాచ్ కోసం అత‌డు జ‌ట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించ‌లేదు. అయితే అత‌డు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై స్పష్టత లేదు. ఆ అత్యవసర పరిస్థితి ఏంటి అనేది తెలియరాలేదు. వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టులోకి రావాలని సీఎస్కే అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రుతురాజ్ జీటీతో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


ఇటీవలే సీఎస్కే ప్లేయర్ ముఖేశ్ చౌదరి తల్లి కన్నుమూసిన సంగతి తెలిసిందే. అంతటి బాధలోనూ ముఖేశ్ ముంబైతో జరిగిన మ్యాచ్‌లో పాల్గొని.. అద్భుతమైన బౌలింగ్ చేశాడు. చెన్నై 103 పరుగుల భారీ తేడాతో గెలవడంలో ముఖేశ్ కీలక పాత్ర పోషించాడు. కన్నతల్లి మరణించిన విషాదంలో ఉండి కూడా జట్టు కోసం పోరాడిన ముకేశ్‌కు ఈ విజయాన్ని అంకితమని మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఇదే మ్యాచ్ లో సంజు శాంసన్(101) సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్2026లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో మూడింట విజయాలతో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ

ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్

Updated Date - Apr 25 , 2026 | 04:56 PM