ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Apr 25 , 2026 | 10:21 AM
రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు అర్ద సెంచరీ చేసి తన జట్టును గెలిపించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(శుక్రవారం) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) విజయం సాధించింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మెరుపు అర్ధ సెంచరీతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రికార్డుల రారాజుగా పేరొందిన కింగ్ కోహ్లీ ఖాతాలో తాజాగా మరో రెండు భారీ రికార్డులు చేరాయి. మరి.. విరాట్ సాధించిన ఆ రికార్డుల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ(Virat Kohli) 44 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్‌లో 800 ఫోర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అలానే ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్‌గా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు. వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. నిన్న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో ప్రస్తుతమున్న ఆటగాళ్లలో కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
ఐపీఎల్ చరిత్రలో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. గుజరాత్‍పై చేసిన హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్ విరాట్ కు ఇది 50వ అర్ధ సెంచరీ. విరాట్‌కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి: