Share News

ఆర్‌సీబీ అదిరేలా..

ABN , Publish Date - Apr 25 , 2026 | 04:51 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్థాయికి తగ్గట్టుగా రాణించింది. విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81), దేవ్‌దత్‌ పడిక్కళ్‌...

ఆర్‌సీబీ అదిరేలా..

మహిళల నాలుగో టీ20 నేడు

భారత్‌ X దక్షిణాఫ్రికా (రా. 9.30)

నేటి మ్యాచ్‌లు

ఢిల్లీ X పంజాబ్‌ మ.3.30(ఢిల్లీ)

రాజస్థాన్‌ X సన్‌రైజర్స్‌ రా.7.30 (జైపూర్‌)

విరాట్‌, దేవ్‌దత్‌ మెరుపు ఇన్నింగ్స్‌

గుజరాత్‌కు మరో ఓటమి

సుదర్శన్‌ శతకం వృథా

బెంగళూరు: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) స్థాయికి తగ్గట్టుగా రాణించింది. విరాట్‌ కోహ్లీ (44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 81), దేవ్‌దత్‌ పడిక్కళ్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 55) తుఫాన్‌ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోవడంతో.. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో ఆర్‌సీబీ నెగ్గింది. ఈ గెలుపుతో పట్టికలో 10 పాయింట్లతో టాప్‌-2కి చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా గుజరాత్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 100) శతకంతో సత్తా చాటగా.. సారథి గిల్‌ (24 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 32), హోల్డర్‌ (10 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లతో 23 నాటౌట్‌) ఫర్వాలేదనిపించారు. ఛేదనలో బెంగళూరు 18.5 ఓవర్లలో 5 వికెట్లకు 206 పరుగులు చేసి గెలిచింది. క్రునాల్‌ పాండ్యా (12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 23 నాటౌట్‌) చివర్లో వేగం చూపాడు. రషీద్‌కు 2 వికెట్లు దక్కాయి. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా విరాట్‌ కోహ్లీ నిలిచాడు.

ఇబ్బందిలేకుండా..: ఛేదనలో ఆర్‌సీబీ ఆరంభం నుంచే రాకెట్‌లా దూసుకెళ్లింది. ఫిల్‌ సాల్ట్‌ స్థానంలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన బెథెల్‌ (14) విఫలమైనా.. మరో ఓపెనర్‌ విరాట్‌ తనదైన శైలిలో చెలరేగాడు. తొలి ఓవర్‌ మూడో బంతికే అతడి సులువైన క్యాచ్‌ను సుందర్‌ వదిలేయడం కలిసొచ్చింది. అటు దేవ్‌దత్‌ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 58/1 స్కోరుతో నిలిచింది. అనంతరం విరాట్‌ బ్యాట్‌కు పనిచెబుతూ ప్రసిద్ధ్‌, రషీద్‌ ఓవర్లలో వరుస బౌండరీలతో స్కోరును పెంచాడు. తొమ్మిదో ఓవర్‌లో దేవ్‌దత్‌ 4,6,6తో 19 రన్స్‌ అందించాడు. రషీద్‌ ఓవర్‌లోనూ రెండు సిక్సర్లు బాదిన దేవ్‌దత్‌ 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ వెంటనే విరాట్‌ 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ బాదాడు. అయితే రెండో వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం జత చేరాక దేవ్‌దత్‌ను రషీద్‌ అవుట్‌ చేశాడు. ఇక రెండు సిక్సర్లతో ఊపు మీదున్న విరాట్‌ను హోల్డర్‌ బౌల్డ్‌ చేయడం.. జితేశ్‌ (10), కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ (8) విఫలం కావడంతో ఆర్‌సీబీ వరుసగా నాలుగు ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయింది. కానీ 18 బంతుల్లో 22 పరుగులు కావాల్సిన వేళ, క్రునాల్‌ 18వ ఓవర్‌లో 4,4,6తో 15 రన్స్‌ అందించడంతో బెంగళూరు విజయం ఖాయమైంది.


0000-Sports.jpg

చెలరేగిన సుదర్శన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు ఓపెనర్‌ సాయి సుదర్శన్‌ వెన్నెముకగా నిలిచాడు. ఈ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న సుదర్శన్‌ చిన్నస్వామి స్టేడియంలో చెలరేగాడు. అయితే ఓ దశలో 12 ఓవర్లలో 127/0 స్కోరుతో ఉన్న జట్టు.. చేతిలో కావాల్సినన్ని వికెట్లున్నా 200 రన్స్‌ చేసేందుకు కష్టపడాల్సి వచ్చింది. ఇతర బ్యాటర్ల నుంచి దూకుడు కనిపించలేదు. అలాగే మరో ఓపెనర్‌ గిల్‌ 13వ ఓవర్‌ వరకు క్రీజులో ఉన్నా షాట్లు ఆడేందుకు ఇబ్బందిపడ్డాడు. దీంతో సుదర్శన్‌ ఎక్కువగా స్ట్రయికింగ్‌ తీసుకుని పరుగులు రాబట్టాడు. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేయగా, ఇందులో గిల్‌ ఎదుర్కొంది ఏడు బంతులే కావడం గమనార్హం. ఆ తర్వాత షెఫర్డ్‌ ఓవర్‌లో సుదర్శన్‌ 6,4.. క్రునాల్‌ ఓవర్‌లో 6,6తో వేగం చూపాడు. చివరకు స్పిన్నర్‌ సుయాష్‌ గూగ్లీకి గిల్‌ దొరికిపోవడంతో తొలి వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ఎలాంటి ఇబ్బందీ లేకుండా సుదర్శన్‌ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కానీ 16వ ఓవర్‌లో సరిగ్గా 100 పరుగుల వద్ద పేసర్‌ హాజెల్‌వుడ్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇవ్వడంతో సుదర్శన్‌ విలువైన ఇన్నింగ్స్‌ ముగిసింది. డెత్‌ ఓవర్లలో ఆర్‌సీబీ బౌలర్లు కట్టుదిట్టం చేయడంతో 17-19 ఓవర్ల మధ్య కనీసం ఒక్క ఫోర్‌ కూడా రాకపోగా బట్లర్‌ (25) అవుటయ్యాడు. అయితే చివరి ఓవర్‌లో హోల్డర్‌ 6,6,4 పుణ్యమాని గుజరాత్‌ స్కోరు 200 దాటింది. వాషింగ్టన్‌ సుందర్‌ (19 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు.


స్కోరుబోర్డు

గుజరాత్‌: సాయి సుదర్శన్‌ (సి అండ్‌ బి) హాజెల్‌వుడ్‌ 100, గిల్‌ (సి) పడిక్కళ్‌ (బి) సుయాష్‌ 32, బట్లర్‌ (సి) హాజెల్‌వుడ్‌ (బి) భువనేశ్వర్‌ 25, వాషింగ్టన్‌ సుందర్‌ (నాటౌట్‌) 19, హోల్డర్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 205/3; వికెట్ల పతనం: 1-128, 2-160, 3-177; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-31-1, హాజెల్‌వుడ్‌ 4-0-40-1, రసిఖ్‌ 3-0-28-0, క్రునాల్‌ 4-0-50-0, షెఫర్డ్‌ 1-0-17-0, సుయాష్‌ 4-0-36-1.

బెంగళూరు: బెథెల్‌ (సి) షారుక్‌ (బి) సిరాజ్‌ 14, విరాట్‌ కోహ్లీ (బి) హోల్డర్‌ 81, పడిక్కళ్‌ (బి) రషీద్‌ 55, పటీదార్‌ (సి) వాషింగ్టన్‌ (బి) సుతార్‌ 8, జితేశ్‌ (సి) సుతార్‌ (బి) రషీద్‌ 10, టిమ్‌ డేవిడ్‌ (నాటౌట్‌) 10, క్రునాల్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 18.5 ఓవర్లలో 206/5; వికెట్ల పతనం: 1-26, 2-141, 3-154, 4-171, 5-173; బౌలింగ్‌: సిరాజ్‌ 3-0-25-1, రబాడ 4-0-45-0, హోల్డర్‌ 3.5-0-35-1, ప్రసిద్ధ్‌ 2-0-31-0, రషీద్‌ ఖాన్‌ 4-0-49-2, మానవ్‌ సుతార్‌ 2-0-19-1.

1

ఐపీఎల్‌లో తక్కువ ఇన్నింగ్స్‌ (47)లోనే 2 వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సుదర్శన్‌. గేల్‌ (48)ను అధిగమించాడు.

1

ఐపీఎల్‌లో వరుసగా మూడు సీజన్లలోనూ శతకం బాదిన ఏకైక భారత ఆటగాడిగా సుదర్శన్‌. ఓవరాల్‌గా గేల్‌ తర్వాత నిలిచాడు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 6 5 0 1 11 1.420

బెంగళూరు 7 5 2 0 10 1.101

రాజస్థాన్‌ 7 5 2 0 10 0.790

హైదరాబాద్‌ 7 4 3 0 8 0.820

చెన్నై 7 3 4 0 6 0.118

ఢిల్లీ 6 3 3 0 6 -0.130

గుజరాత్‌ 7 3 4 0 6 -0.790

ముంబై 7 2 5 0 4 -0.736

లఖ్‌నవూ 7 2 5 0 4 -1.277

కోల్‌కతా 7 1 5 1 3 -0.879

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 04:51 AM