ఐపీఎల్ 2026: ఆర్సీబీ విజయంపై కోహ్లీ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:06 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విజయం వెనక ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ(81) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు
స్పోర్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(ఏప్రిల్ 24న) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విజయం వెనక ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. అర్ధ సెంచరీతో రాణించిన కోహ్లీ(81) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌తో తమ విజయం సులువుగా మారిపోయిందని కోహ్లీ వెల్లడించాడు. జీటీపై విరాట్ 44 బంతుల్లో 81 పరుగులు చేయగా, పడిక్కల్ 27 బంతుల్లో 55 పరుగులు సాధించాడు.
మ్యాచ్ అనంతరం విరాట్ మాట్లాడుతూ..'బ్యాటింగ్‌కు దిగినప్పుడు తొలుత పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడానికి కొన్ని ఓవర్లు నెమ్మదిగా ఆడదామని నేనూ, బెతెల్ అనుకున్నాం. గుజరాత్‌లో నాణ్యమైన బౌలింగ్ విభాగం ఉంది. దేవదత్ పడిక్కల్ అద్బుత ప్రదర్శన చేశాడు. అతడెప్పుడూ బంతిని ఎదుర్కొనేటప్పుడు ఇబ్బందిపడటం చూడలేదు. చాలా స్వేచ్ఛగా ఆడతాడు. తొలి అర్ధభాగంలో అతడి ఇన్నింగ్సే ఇరుజట్ల మధ్య చాలా వ్యత్యాసం చూపించింది. ఆ తర్వాత నేను క్రీజ్‌లో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాను. అయితే ఏ దశలోనూ ఒత్తిడికి గురికాలేదు' అని వెల్లడించాడు.
'మా బౌలర్లు బాగా రాణించారు. ఓ దశలో మాకు కనీసం 230 పరుగుల లక్ష్యం ఉంటుందేమో అనుకున్నా. కానీ, కీలక సమయంలో మా బౌలర్లు అదరగొట్టారు. గుజరాత్ జట్టును తక్కువకే కట్టడి చేయగలిగారు. అలానే మాకు అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. నాణ్యమైన షాట్లు కొట్టడంలో మావాళ్లకు తిరుగులేదు. మాది సింపుల్ స్ట్రాటజీ.. భారీ షాట్లకు ప్రయత్నించి ఔటైనా ఫర్వాలేదు ఎందుకంటే మా లోతైన బ్యాటింగ్ ఆర్డర్‌తో ఎలాంటి ఇబ్బంది లేదు. బెంగళూరు నగరంలో మా మ్యాచులను ఆడేశాం. మళ్లీ ఇక్కడికి వచ్చి ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాం’ అని కోహ్లీ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్