వారు నా ప్రతిభను గుర్తించలేదు.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 02:47 PM
పాకిస్థాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: పాకిస్థాన్ క్రికెటర్ జాఫర్ గోహర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఈ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. లాహోర్‌లో జన్మించిన గోహర్ 2015లో పాకిస్థాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. చివరగా 2021లో న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. స్వల్పకాల అంతర్జాతీయ కెరీర్‌లో 2 వికెట్లు తీసి, 86 పరుగులు చేసిన గోహర్.. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 343 వికెట్లు తీసి, 3098 పరుగులు సాధించాడు.
ఇలా దేశీయ క్రికెట్‌లో చక్కగా రాణిస్తున్నప్పటికీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తనను పట్టించుకోలేదని గోహర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడు. ముఖ్యంగా ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నేతృత్వంలోని బోర్డు, సెలక్షన్ కమిటీ తన ప్రతిభను గుర్తించలేదని బహిరంగ ఆరోపణలు చేశాడు. గోహర్ దేశీయ దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. అయితే పాక్ సెలక్షన్ కమిటీ గోహర్ కౌంటీ ప్రదర్శనలను పరిగణలోకి తీసుకోలేదు. ఓ సెలెక్టర్ ఏకంగా గోహర్ కౌంటీ ప్రదర్శనలను చిత్తు కాగితాలపై లెక్కలంటూ తీసిపారేశాడు. దీంతో విసిగిపోయిన అతను ఇంగ్లండ్‌కు మకాం మార్చి, అక్కడ జాతీయ జట్టు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.
విదేశీ ఆటగాడిగా గ్లౌసెస్టర్‌షైర్ తరపున నాలుగు సీజన్లు ఆడిన తర్వాత, అతడికి బ్రిటిష్ పౌరసత్వం జారీ చేయబడింది. ప్రస్తుతం మిడిల్సెక్స్ తరఫున స్థానిక ఆటగాడిగా ఆడుతున్నాడు. ఆ జట్టు తరఫున 164 పరుగులు చేసి, ఐదు వికెట్లు పడగొట్టి అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. ఇంగ్లండ్ జట్టులో ప్రస్తుతం నాణ్యమైన స్పిన్ బౌలర్ల కొరత ఉంది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, స్థిరమైన ఎడమచేతి స్పిన్నర్ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గోహర్‌కు అవకాశం లభించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అవకాశం వస్తే సిద్ధంగా ఉంటానని గోహర్ స్పష్టం చేశాడు. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్, బాయ్డ్ రాంకిన్, ఇయాన్ మోర్గాన్ వంటి ఇతర దేశాలకు చెందిన పలువురు ప్రముఖ ఆటగాళ్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఆర్సీబీ విజయంపై కోహ్లీ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్ 2026: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ అర్ధ సెంచరీ