ఐపీఎల్ 2026: హోం గ్రౌండ్‌లో ఆర్సీబీ అర్ధ సెంచరీ
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:17 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆర్సీబీ ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (శుక్రవారం) చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 18.5 ఓవర్లలో సునాయాసంగా ఛేదించింది. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ(81 పరుగులు)తో రాణించి.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆర్సీబీ ఓ అరుదైన మైలురాయిని అందుకుంది.
నిన్నటి మ్యాచ్‌లో గుజరాత్‌పై గెలుపుతో సొంత మైదానం బెంగళూరులో ఆర్సీబీ తమ 50వ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ముంబై ఇండియన్స్ (వాంఖడే), కేకేఆర్ (ఈడెన్ గార్డెన్), సీఎస్‌కే (చెపాక్) జట్ల సరసన చేరింది. ఈ జట్లు కూడా తమతమ సొంత వేదికలపై 50 విజయాలు నమోదు చేశాయి. 2008 నుంచి గత సీజన్ వరకు మొత్తం కలిపి బెంగళూరులో 46 విజయాలు నమోదు చేసిన ఆర్సీబీ, ఈ ఒక్క సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచులే ఆడగా 4 విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో బెంగళూరులో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో మాత్రమే ఓడింది.
ఐపీఎల్‌లో ఒక వేదికపై ఒక జట్టు సాధించిన అత్యధిక విజయాలు
58 - ముంబై ఇండియన్స్(వాంఖడే)
55 - కోల్‌కతా నైట్ రైడర్స్(కోల్‌కతా)
53 - చెన్నై సూపర్ కింగ్స్ (చెన్నై)
50 - ఆర్సీబీ (బెంగళూరు)
40 - ఎస్ఆర్‌హెచ్(హైదరాబాద్)
గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించడం ద్వారానూ ఆర్సీబీ మరో ఘనత సాధించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 200 పైన ఉన్న టార్గెట్‌ను ఛేదించిన జట్ల జాబితాలో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచింది. అలాగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఛేదించిన 206 పరుగుల లక్ష్యం ఆ జట్టుకు ఐపీఎల్‌లో రెండో అత్యధిక లక్ష్య ఛేదనగా కావడం గమనార్హం.
ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 200 ప్లస్ లక్ష్యాన్ని ఛేదించిన టాప్ జట్లు
పంజాబ్ కింగ్స్- 10
ముంబై ఇండియన్స్- 6
ఆర్సీబీ-5
రాజస్థాన్- 5
ఎస్ఆర్‌హెచ్- 5
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ
ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్