Share News

పరాగ్‌లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్‌ను చూడలేదు.. ఆర్ఆర్ కోచ్ సంగక్కర

ABN , Publish Date - Apr 25 , 2026 | 02:23 PM

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో సారథిగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా తేలిపోతుండటంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ఫామ్ గురించి ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు.

పరాగ్‌లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్‌ను చూడలేదు.. ఆర్ఆర్ కోచ్ సంగక్కర
Riyan Parag

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగం టోర్నమెంట్ ముగిసింది. కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తోంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఐదు గెలిచి 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్‌తో పాటు ఆర్ఆర్ బౌలర్లు స్థిరంగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం ఫామ్ లేమితో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. దీంతో సారథిగా రాణిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా తేలిపోతుండటంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ ఫామ్ గురించి ఆ జట్టు హెడ్ కోచ్ కుమార సంగక్కర కీలక వ్యాఖ్యలు చేశాడు.


‘గత మ్యాచుల్లో రియాన్ పరాగ్ బాగానే బ్యాటింగ్ చేశాడు. ఒక్కోసారి మంచిగా బ్యాటింగ్ చేసినా.. పరుగులు చేయడం కష్టమవుతుంది. అలాగని అతడి ఉద్దేశం బాగోలేదని కాదు. ఒకవేళ రియాన్ బంతిని సరిగా అంచనా వేయలేక ఇబ్బంది పడుతుంటే ఆందోళన చెందేవాడినేమో. కానీ అలా జరగడం లేదు. కాసేపు క్రీజులో ఉండి మరికొన్ని పరుగులు చేస్తే సరిపోతుంది. ఒక్క మంచి ఇన్నింగ్స్‌తో ఇప్పుడు వస్తోన్న అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఫ్రాంచైజీ అతడికి 100శాతం మద్దతుగా నిలుస్తుంది. నాయకుడిగా జట్టును ఎలా నడిపిస్తున్నాడనేదే మేం చూస్తున్నాం. ప్రస్తుతం మాకు అదే ముఖ్యం. ఒత్తిడిలోనూ మెరుగైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇంకా నేర్చుకుంటూ మెరుగవుతున్నాడు. రాజస్థాన్ జట్టులో కెరీర్ ఆరంభం నుంచి రియాన్‌లా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్న మరో క్రికెటర్‌ను ఇప్పటి వరకు చూడలేదు. సోషల్ మీడియాలో అతడిపై ఎలాంటి కామెంట్లు వచ్చాయో చూశాం. కానీ వాటన్నింటినీ పక్కన పడేసి మంచి సారథిగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు’ అని సంగక్కర తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ

ఆ చెంపదెబ్బతో హర్భజన్‌కు రూ.కోటి ఆదాయం: శ్రీశాంత్

Updated Date - Apr 25 , 2026 | 02:24 PM