చెన్నై సూపర్ కింగ్స్‌లోకి సౌతాఫ్రికా ఆల్ రౌండర్
ABN , Publish Date - May 14 , 2026 | 09:51 PM
ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వరుసగా మూడు ఓటములతో సీజన్ ప్రారంభించిన సీఎస్కే ఆ తర్వాత పుంజుకుని రేసులోకి వచ్చింది. ఇటీవల జరిగిన తన చివరి మూడు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రేపు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకోవాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు.
కుడి తొడ గాయంతో బాధపడుతున్న ఓవర్టన్.. తదుపరి చికిత్స కోసం ఇంగ్లండ్‌కు తిరుగు పయనమయ్యాడు. ఈ విషయాన్ని సీఎస్కే మేనెజ్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియన్ ఫారెస్టర్‌ను జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరకు అతడితో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. 'జేమీ ఓవర్టన్‌కు కుడి కాలు తొడకు గాయమైంది. అతడు తదుపరి చికిత్స కోసం ఇంగ్లండ్ కు వెళ్లాడు. ఓవర్టన్ లేకపోవడం జట్టుకు కాస్త ఇబ్బందికర పరిణామమే. కానీ కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం' అని సీఎస్కే యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఓవర్టన్ దూరం కావడం చెన్నై జట్టుకు భారీ షాక్ అనే చెప్పాలి. కారణం.. ప్రస్తుతం ఓవర్టన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉన్నాడు. మరోవైపు బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్‌లో కీలక పరుగులు చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఓవర్టన్ స్థానంలో జట్టులోకి వచ్చిన డియాన్ కూడా అద్భుతమైన ఆల్‌రౌండర్. ఇటీవల ముగిసిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఫారెస్టర్ అదరగొట్టాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకంగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్
శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ