హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు
ABN , Publish Date - May 08 , 2026 | 11:29 AM
ఐపీఎల్ 2026 సీజన్‌లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. ఆటగాళ్ల భద్రత, టోర్నీ సమగ్రత దృష్ట్యా అన్ని ఫ్రాంచైజీలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జట్లకు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంతకంతో ఏడు పేజీల అధికారిక నోటీసు పంపినట్లు సమాచారం.
‘ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, జట్టు అధికారులు కొన్ని దుష్ప్రవర్తనలు, నిబంధనలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ దృష్టికి వచ్చింది. వీటిని పరిష్కరించకుండా వదిలేస్తే అవి ఈ టోర్నమెంట్‌కు, సంబంధిత ఫ్రాంచైజీకి, పాలక మండలి అయిన బీసీసీఐకి అపకీర్తిని తీసుకొస్తాయి’ అని జట్లకు పంపిన నోటీసులో సైకియా పేర్కొన్నారు.
కొందరు ఆటగాళ్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి హోటళ్లలో ఉండటం, ప్రయాణాలు చేయడం పట్ల బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లుగా ఉన్న వ్యక్తుల ద్వారా అంతర్గత సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉందని బోర్డు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆటగాళ్లను కలిసే వారి వివరాలు, హోటల్‌లో వారి కదలికలన్నిటినీ రికార్డు చేయాలని సూచించింది. అవసరమైతే అకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది.
ఎవరైన నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇందులో షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు, సస్పెన్షన్ లేదా డిస్‌క్వాలిఫికేషన్ వంటి చర్యలు ఉండొచ్చని బీసీసీఐ తెలిపింది. చట్టపరమైన ఉల్లంఘనలు ఉంటే పోలీసు కేసులు కూడా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా, ఆటగాళ్లను బీసీసీఐ అప్రమత్తం చేయడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా భారత జట్టు విదేశీ పర్యటనల సమయంలో కుటుంబ సభ్యులు, భాగస్వాముల ప్రయాణాలపై పరిమితులు విధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: పంత్ రికార్డును బద్దలు కొట్టిన మార్ష్